Drone and Leopard : గత కొన్ని రోజులుగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇక్కడి నర్సరీల్లో అది సంచరిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్ఓ భరణి తెలిపారు. చిరుత ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుత నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పించినట్లు ఆయన చెప్పారు. చిరుత పాదముద్రలు గుర్తించామన్నారు. మండపేట, ఆలమూరు వైపు వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు. చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైల్వే ట్రాక్, కాల్వ దాటి దివాన్ చెరువు నుంచి చిరుత కడియం నర్సరీలకు చేరిందన్నారు. గురువారం ట్రాప్ కేజెస్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఏడిద, మర్నిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు కోనసీమ జిల్లా డీఎఫ్ఓ ప్రసాదరావు తెలిపారు. చిరుత సంచారంపై స్థానికులకు అవగాహన కల్పించామన్నారు. కడియపు లంకలో చిరుత సంచారంపై మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్లు వెల్లడించారు.