JAISW News Telugu

Journalism : జనాలకు దూరమైపోయిన జర్నలిజం..తప్పెవరిది!

Journalism

Journalism

Journalism : ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు, ప్రతిష్టలు ఉండేవి. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ  ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేవారు. జీతభత్యాలు పెద్దగా లేకపోయిన సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహం ఉన్నవారు జర్నలిజంలోనే ఉండిపోయారు. రాసిన వార్తలకు సమాజంలో జరిగే మార్పులను చూసి ఆనందపడేవారు. ఆ వార్త గురించి ప్రజల్లో చర్చ వస్తే చూసి మురిసిపోయేవారు. అది ఎన్ని డబ్బులు ఇచ్చిన కొనలేని ఆత్మసంతృప్తి.

1990ల తర్వాత జర్నలిజంలోకి రాజకీయాలు చొచ్చుకొచ్చాయి. జర్నలిజంలో విపరీతంగా సంపాదించుకున్న యాజమాన్యాలు పాలకులు కూడా తమ చేతిలో ఉండాలని కోరుకోవడంతోనే జర్నలిజానికి తిప్పలు వచ్చాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను కూలదోసి ఎన్టీఆర్ సీఎం కావడానికి ఈనాడు తన వార్తల ద్వారా అనేక ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తమ మాట వినకపోవడంతో చంద్రబాబు సీఎం అయ్యేదాక ఈనాడు చేయని ప్రయత్నం లేదు. ఆ తర్వాత ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబును సీఎంగా ఉంచడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజల్లో పలచన చేసే ప్రయత్నం చేశాయి. ఆయన వరుసగా 2004, 2009లో గెలిచారు. ఇక ఆ తర్వాత తమ దాడిని ఆయన కుమారుడు జగన్ వైపునకు మళ్లించాయి. ఈ రెండు పత్రికలను ఎదుర్కొవడానికి జగన్ ‘సాక్షి’ పత్రికను తీసుకొచ్చారు.

ఇలా రాష్ట్రంలో పత్రికలన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తుండడంతో జనాల దృష్టిలో చులకన అయిపోయాయి. పార్టీలకు కరపత్రికలుగా మారడంతో వాటిని పట్టించుకునేవారు లేరు. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడి, ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే ఉండే విలువ ఇప్పుడు లేదనే చెప్పవచ్చు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా వార్తలు రాయలేని పరిస్థితి. సదరు సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు పార్టీల కార్యకర్తలుగా వార్తలు రాయాల్సిన దుస్థితి. అందుకే జర్నలిస్టులను జనాలు పట్టించుకోవడం లేదు. జర్నలిజం సమాజానికి దూరమై పోయింది.

Exit mobile version