Iran Missile Attack : అమెరికాపై విరుచుకుపడ్డ ఇరాన్..రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది..?
Iran Missile Attack : మధ్య ఆసియా దేశాల్లో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఇప్పటికే యెమెన్ పై దాడికి దిగింది అగ్రరాజ్యం అమెరికా. హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. బ్రిటన్ సహ వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హౌతి రెబెల్స్ పై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది.
ఈక్రమంలో అమెరికాపై దాడులకు ఇరాన్ సిద్ధపడింది. ఇరాక్ లో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించింది. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ దీన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడులను తామే చేశామని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఎర్బిల్ లోని అమెరికన్ కాన్సులేట్.. గూఢచార్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది.
దీనికి ప్రతీకార దాడికి దిగారు ఇరాన్ మిలిటెంట్లు. ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పై ఏకంగా బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించారు. ఈ ఘటనలో అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని అమెరికా రక్షణ విభాగం ప్రధాన కార్యాలయం పెంటగాన్ ధ్రువీకరించింది. సైనికులు గాయపడినట్టు అధికారికంగా వెల్లడించింది.
ఇరాక్ పశ్చిమ ప్రాంతంలోని ఆల్-అసద్ లో ఉంటుంది అమెరికన్ ఎయిర్ బేస్. ఆ దేశ కాలమాన ప్రకారం సాయంత్రం 6.30గంటలకు ఈ దాడి జరిగింది. ఇరాన్ మిలిటెంట్లు తమ ఎయిర్ బేస్ పై మిస్సైళ్లను సంధించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్ కామ్ తెలిపింది. ఈ దాడి వెనక ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. ఈ దాడి తీవ్రత ఎంత అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సెంట్ కామ్ పేర్కొంది. నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు వివరించింది. కాగా, ఈ ఘటనపై వైట్ హౌస్ స్పందించలేదు.