A Respect Story : 20 ఏండ్ల క్రితం హైదరాబాద్ బ్రాంచికి మేనేజర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యాక మా పాప పెళ్లికి, మా ఆఫీస్ స్టాఫ్ అందరిని ఆహ్వానించాను. వచ్చిన వాళ్లందరూ తలో కానుక ఇచ్చి ఆశీర్వదించి వెళ్లారు నవ వధూవరుల్ని..
పెళ్లి హడావిడి అంతా తగ్గాక, తిరిగి ఆఫీసుకు వెళ్లాక వాచ్ మన్ వెంకట్రాముడుని పిలిపించి అడిగాను.. ‘‘వెంకట్రాముడు గారు..మీరు సతీసమేతంగా మా కూతురు పెళ్లికి రావడం, ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది.. కానీ కానుకగా మీరు ఇచ్చిన 10గ్రాముల బంగారు గొలుసు ఇవ్వడం మీకు తలకు మించిన భారం అవ్వలేదా?
అసలు అంత విలువైన కానుక మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది..’’ అని అడిగాను. తాను కానుకగా ఇచ్చిన బంగారు గొలుసును తనకే తిరిగి ఇచ్చివేస్తూ…
కానీ వెంకట్రాముడు.. నా చేతినుంచి దూరంగా తన చేతిని తీసుకుంటూ, అయ్యా, కానుకను తిరిగి ఇచ్చి నన్ను అవమానపర్చొద్దు … నా ముప్పయి ఏళ్ల సర్వీస్ లో
నన్ను “గారు” అని కానీ “మీరు” అని కానీ పిలిచిన వాళ్లు ఎవ్వరూ లేరు. ఒక్క మీరు తప్ప! కానీ, పొద్దున్న మీరు ఆఫీసుకు వచ్చేటప్పుడు ప్రతీ రోజూ పలకరిస్తారు. నన్ను గుడ్ మార్నింగ్ వెంకట్రాముడు గారు, బాగున్నారా? అని. మీ పలకరింపు వినడానికే నేను, మీకన్నా ముందే వచ్చి గేట్ దగ్గర నిలబడుతాను. ..
మనిషి వృత్తిని బట్టి కాక, మనిషికి గౌరవం ఇచ్చే మీలాంటి గొప్పోడి కడుపున పుట్టిన బిడ్డకు నేను ఎంతటి కానుకలు ఇచ్చినా గొప్పవేం కాదు సార్.. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు.. ఆస్తులు లేకపోవచ్చు. కానీ, మా ఆత్మగౌరవం నిలబెట్టే మీలాంటి మర్యాదస్తుల కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం సార్.. దయచేసి కాదనకండీ అంటూ దండం పెట్టి కళ్లనీళ్లతో వెళ్లిపోయాడు.
ఒక మనిషికి గౌరవం ఇస్తే, ఇంత ప్రేమిస్తారా, అభిమానిస్తారా? అని నాలో నేను ఆలోచనలో పడ్డాను. అవును, నిజమే కదా, వెంకటరాముడు చెప్పింది. మనిషి వృత్తిని బట్టి కాదు, సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తే చాలు. ప్రేమిస్తే చాలు కచ్చితంగా లక్షలరెట్ల ప్రేమ తిరిగి మన పైన వర్షిస్తారు. మీరు కూడా దయచేసి గౌరవించండి, మనం సాటిమనిషిని ఎవరి నైనా గౌరవించాలి. గౌరవం హోదాని బట్టీ ఇచ్చేది కాదు అని నా ఉద్దేశ్యం.