Gurucharan : ప్రముఖ గేయ రచయిత గురుచరణ్ కన్నుమూత
Lyricist Gurucharan : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం (సెప్టెంబరు 12న) ఉదయం మృతి చెందారు. గురుచరణ్ ప్రముఖ తెలుగు కవి ఆత్రేయ దగ్గర శిష్యరికం చేసి తనదైన శైలిలో పాటలు రాసి మంచి గుర్తింపు పొందారు. ఆయన రాసిన ఎన్నో విషాద గీతాలు తెలుగు సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఇక మోహన్ బాబు కోసం ప్రత్యేకంగా ఆయన పాటలు రాశారు.
రచయిత గురుచరణ్ రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. అందులో ‘‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’’, ‘‘కుంతీకుమారి తన కాలుజారి’’. ‘‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’’ లాంటి ఎన్నో సూపర్ హిట్ పాటలను మోహన్ బాబుకు అందించారు. గురుచరణ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, పాటల ప్రేమికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. గురుచరణ్ అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. గురుచరణ్ ఎం.ఎ. వరకు చదివారు.