America : గత రెండు, మూడు రోజులుగా భూకంప వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో తైవాన్, చైనా, జపాన్, భారత్ లోని హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. తాజాగా శుక్రవారం(ఏప్రిల్ 5)న అమెరికాలో వచ్చిన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.30గంటలకు న్యూజెర్సీలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.8గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనలు న్యూయార్క్ నూ తాకినట్లు సమాచారం.
న్యూజెర్సీలోని వైట్ హౌస్ స్టేషన్ కు 7 కిలో మీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 4.6 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టం లేనట్లు వారు చెబుతున్నారు. న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో గాజా పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా ప్రకంపనలు రావడంతో సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అది భూకంపమా అని మండలిలో ప్రశ్నిస్తున్న సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధి జాంటీ సోరిప్టో వ్యాఖ్యానించారు. భూకంపాన్ని 42 మిలియన్ల మంది అమెరికన్లు అనుభూతి చెందినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
న్యూజెర్సీలోని ఎడిసన్ ప్రాంతంలో పలు ఆపార్టమెంట్లలో బీటలు వారాయి. అలాగే భవనాలు, వాహనాలు భూకంపతాకిడికి కుదుపునకు లోనయ్యాయి. వెంటనే ప్రజలు అందరూ ఇండ్లు, చర్చిల నుంచి బయటకు వచ్చారు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఎలాంటి నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో భూకంపాలు తక్కువగా వస్తాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. బాల్టిమోర్, ఫిలడెల్ఫియా సహా వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్టు స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇక ఈ భూకంపంపై న్యూయార్క్ లో ఉన్న భారత ఎంబసీ స్పందించింది. భారత సంతతి వారందరితో టచ్ లో ఉన్నామని, ఇప్పటివరకు ఏ భారతీయుడు ఈ ప్రకృతి విపత్తు వల్ల గాయపడలేదని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ భూకంపం వల్ల ప్రభావితమైన ఇండియన్ అమెరికన్ ఎవరైనా తమకు సమచారం అందించాలని కోరింది.