Outsourcing Employees : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అంత కూడా దాదాపుగా ఐఏఎస్ అధికారుల గుప్పిట్లోనే ఉంటది. కొందరు అధికారులు చేస్తున్న తప్పుడు పనులు నిజాయితీ అధికారులకు కూడా ఇబ్బంది కరంగా ఉంటాయి. చేసిన తప్పులు ఏదయినా మీడియా ద్వారా బయటకు వస్తేనే వెంటనే చేసిన తప్పులను సర్దుకుంటారు. అప్పటివరకు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు పరిపాలనలో తమకు నచ్చిన విదంగా వెళుతున్నారు. అధికారం చేతుల్లో ఉందని నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
అధికారుల సౌకర్యార్థం వాళ్ళ ఛాంబర్ లో అటెండర్లను ప్రభుత్వం నియమించింది. ఆలా నియామకం అయిన వారిని కేవలం కార్యాలయం తో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పనుల కోసమే సద్వినియోగం చేసుకోవాలి. ఆలా సద్వినియోగం చేసుకోకుండా కొందరు అధికారులు నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు రాష్ట్రంలో వ్యక్తం అవుతున్నాయి. కార్యాలయం పనులు, ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల పనులు చేయించుకోకుండా వాళ్ళతో ఇంటిపనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కొందరు అధికారులు వారి ఇళ్లల్లో ఒక్కరో, ఇద్దరితో ఇంటి పనులు చేయించుకోవడం లేదు. గంప గుత్తగా ఎనిమిది మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపి పనులు చేయించుకుంటున్నారని కొందరు అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.
అధికారుల ఇళ్లల్లో ఇల్లు శుభ్రం చేయించుకోవడం, వాహనాలను కడిగించడం, ఇంటి ఆవరణలోని చెట్లను, మొక్కలను పెంచే పనులు, పెంచుకుంటున్న జంతువులను వైద్యుల వద్దకు తీసుకెళ్లడం, పిల్లలను విద్య సంస్థల్లో చేర్చడం, సాయంత్రం తిరిగి తీసుకు రావడం, బంధువులు వస్తే వాళ్ళను తీసుకు రావడం, తిరిగి వెళ్ళేవరకు వాళ్లకు అందబుబాటులో ఉంటూ సకల సౌకర్యాలు చేయడం,మార్కెట్ కు వెళ్లి ఇంటికి సరిపడేంత సరుకులు ప్రతి రోజు తెచ్చి పెట్టడం వంటి పనులు చేయించుకుంటున్నారని ఆరోపణలు తోటి అధికారుల నుంచే వ్యక్తం కావడం విశేషం.
ఇటీవల ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మరణంతో ఇంటి పనులు బయటకు వచ్చాయి. ఉన్నతాధికారి వేధింపులతోనే ఆ ఉద్యోగి మృతి చెందినట్టు ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఉద్యోగం పోతుందనే భయంతోనే బయటకు చెప్పకుండా తమలో తాము ఆవేదనతో కుంగిపోతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వెట్టి చాకిరిని నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. ఎంత మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నియామకం అయ్యారు. ఉన్నతాధికారుల వద్ద వారిలో ఎందరు పని చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎందరు పనిచేస్తున్నారు. అధికారుల ఇంటికి ఎందరు వెళుతున్నారు వంటి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపడానికి సిద్దమయినట్టు సమాచారం.