Tirumala : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తిరుమలతో అవినాభావ సంబంధం ఉంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల విషయంలో నిత్యం భక్తి భావంతో ఉంటారు. అయితే ఇటీవల పాలన పగ్గాలు చేబట్టిన చంద్రబాబు జగన్ హాయంలో అవినీతి కంపును ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల నుంచే దీన్ని ప్రారంభిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ అధికారిగా శ్యామలా రావును సీఎం చంద్రబాబు నియమించారు. ఆయన తిరుమలపై అన్ని విభాగాలను తనిఖీలు చేస్తూ తాను తీసుకుంటున్న నిర్ణయాలను, చేపడుతున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ దృష్టికి తెస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండపై పూర్తి స్థాయి విద్యుత్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా 250 బస్సులు
రెండేళ్ల క్రితం తిరుమలకు విద్యుత్ బస్సులు వచ్చాయి. అవి తిరుమల -తిరుపతి, తిరుపతి- రేణిగుంట, తిరుపతి -కడప, తిరుపతి- మదనపల్లె, తిరుపతి -నెల్లూరు, తిరుపతి- శ్రీకాళహస్తి మధ్య నడుస్తున్నాయి. సీబీఎస్ తోపాటు అలిపిరి డిపోలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కొండపై పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులను నడపాలనే నిర్ణయంలో భాగంగా తిరుమల -తిరుపతి మధ్య 250 బస్సులను తిప్పబోతున్నారు. కొండపై బాలాజీనగర్ కు వెళ్లే మార్గంలో ఉన్న గ్యాస్ గోడౌన్ వద్ద 4 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు.
సుప్రభాత సేవలో డీజీపీ
రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలకు రావడంతో ఆయనకు ఈ అంశాన్ని వివరించారు. బాలాజీనగర్ వద్ద స్థలాన్ని పరిశీలించి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తం చేశారు. ఆర్టీసీ తరఫున టీటీడీకి ప్రతిపాదనలు పంపించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ ఎండీగా కూడా ఆయనే కొనసాగుతున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో డీజీపీకి వేద పండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు.