Acharya Nagarjuna University : గోదావరిలో లభించే పులస చేపలలో ఉండే పోషక పదార్థాలపై చేసిన పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జువాలజీ అధ్యాపకుడు ఆచార్య పీవీ కృష్ణకు పేటెంట్ లభించింది. ఈ మేరకు చెన్నైలోని భారత ప్రభుత్వ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పేటెంట్ కార్యాలయం నుంచి పత్రం ఆయనకు అందింది. వర్సిటీలో మంగళవారం వీసీ ఆచార్య కే.గంగాధరరావు నుంచి ఆ పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ పేటెంట్ రావడం గర్వకారణమన్నారు. ఆచార్య పీవీ కృష్ణ మాట్లాడుతూ పులస చేపలలో ప్రోటీన్లు, సాచ్యురేటెడ్, అన్ సాచ్యురేటెడ్ ఆమ్లాలలో అతి ముఖ్యమైన డోకోసహెక్సయీనోయిక్ (డీహెచ్ఏ), ఐకోసపెంటయీనోయిక్ (ఈపీఏ) ఆమ్లాల మీద పరిశోధన చేశానన్నారు. ఈ సందర్భంగా రెక్టార్ ఆచార్య కె.రత్నషీలా మణి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, జియాలజీ విభాగాధిపతి ఆచార్య పీజే రత్నాకర్, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు తదితరులు ఆయనను అభినందించారు.