Ponguleti Srinivas Reddy : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ముందుగా ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి మంగళ వాయిద్యాలు, పూలమాలలతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఉపాలయంలని లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంత్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇల్లను మంత్రి పరిశీలించి అక్కడ కాంట్రాక్టర్ తో మాట్లాడారు. లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాలులో భద్రాచలం అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మొదటి విడత రూ.68 కోట్లతో స్థల పరిశీలన పనులు త్వరలోనే మొదలు పెడతామన్నారు. సీఎం ఆదేశాలతో మరిన్ని నిధులను మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు.