Mutton : మటన్ తినడం ఆరోగ్యానికి మేలా? చెడా?
Mutton : ప్రపంచంలోని జనాభాలో 95శాతానికి పైగా నాన్ వెజ్ తినేవారే. కోడికూర అంటే ఇష్టపడని వారు ఉంటారా? అలాగే తలకాయ, బోటి, మూలుగు బొక్క తినకుండా ఉండగలరా?.. మాంసం అంటే నోరూరనిది ఎవరికి? మటన్‌లో చాలా పోషకాలు లభిస్తాయి. మటన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పోషకాహారం అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి.
మటన్ లో విటమిన్ బి1, బి2, బి3, బి9 మరియు బి12 ఉంటాయి. విటమిన్ ఇ, కె, సహజ కొవ్వులు, కొలెస్ట్రాల్, అమైనో ఆమ్లాలు, మాంగనీస్, కాల్షియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం, పొటాషియం, సోడియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మటన్‌లో ప్రొటీన్లు, న్యూట్రీషియన్స్ మరియు బి12 పుష్కలంగా ఉండటం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యంతో పాటు, ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి, దెబ్బతిన్న కణాలను సరిచేయడానికి సహాయపడుతుంది.
గర్భిణులు కూడా ఆహారంలో మటన్ తింటే.. పుట్టిన పిల్లలకు న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రాకుండా చూడొచ్చు. బహిష్టు సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. మటన్‌లోని బీకాంప్లెక్స్, సెలీనియం, కోలిన్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. మటన్‌లో అధిక పొటాషియం, తక్కువ సోడియం కారణంగా, రక్తపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. మటన్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. సోరియాసిస్, ఎగ్జిమా మొదలైన చర్మ సమస్యలను దూరం చేస్తుంది.చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది.
అదే క్రమంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు మటన్ తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా మటన్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని పరిశోధనలో తేలింది. మీరు మటన్ తినాలనుకుంటే, తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోండి. 40 ఏళ్లు పైబడిన వారు అప్పుడప్పుడు తప్ప ఆహారంలో మటన్‌ను రోజూ చేర్చుకోకూడదు.