Sun Stroke : భానుడు భగ్గుమంటున్నాడు..రోజురోజుకూ మరింత సుర్రుమంటున్నాడు. ఏప్రిల్, మే, జూన్ రెండో వారం వరకు ఈసారి ఎండలు దంచికొట్టనున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో జనాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, కర్నాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో వేడిగాలులు వీస్తున్నాయి. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని అంటున్నారు. డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు రోజువారీ ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాదు రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముసలివారు, చిన్న పిల్లలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు:
– వడదెబ్బ తగిలితే కళ్లు బైర్లు కమ్మడం, తల తిరిగినట్లు అనిపిస్తుంది.
– వడదెబ్బకు గురైన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. నాలుక తడారిపోతుంటుంది.
– గుండె వేగంగా కొట్టుకోవడం, దాహం తీవ్రంగా ఉంటుంది.
– వాంతులు, విరేచనాలు, అతిసారం బారిన పడుతుంటారు.
-తలనొప్పి, కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
– నీళ్లు ఎక్కువగా తాగాలి. బయట పనిచేసేవాళ్లు కొబ్బరినీళ్లు, జ్యూసులు, చల్లటి నీళ్లు తరుచుగా తాగాలి. వీటి ద్వారా డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం.
– ముదురు రంగు బట్టలు వేడిని గ్రహిస్తాయి. అందుకే లేత రంగు, తెలుపు రంగు బట్టలు ధరించాలి. బిగుతు బట్టల కంటే వదులుగా ఉండేవి వేసుకోవాలి.
– ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు తిరగకపోతేనే మంచిది.
– ఒకవేళ ఎండకు వెళ్లడం తప్పదు అనుకుంటే గొడుగు తీసుకెళ్లాలి. క్యాపులు ధరించాలి.
వడదెబ్బ సొకితే ఇలా చేయాలి:
-వడదెబ్బ సోకిన వారిని చల్లటి గాలి, వెలుతురు ధారళంగా వచ్చే గదిలో ఉంచాలి.
– నిమ్మరసం, మంచినీళ్లు, కొబ్బరినీళ్లు తరుచు అందించాలి. గ్లూకోజ్ లాంటివి కూడా అందించాలి.
– వారిని ప్రశాంతంగా ఉండనివ్వడంతో పాటు అవసరమైతే డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది.