Hamas chief : హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య.. ఇజ్రాయిలే పాత్రధారి అంటూ సంస్థ ప్రకటన.. ఇంతనీ ఆయనను ఎవరు చంపారు?

Hamas chief

Hamas chief

Hamas chief : కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌ పై పోరాటం చేస్తున్న హమాస్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా (62) ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థ ‘ప్రెస్‌ టీవీ’ బుధవారం (జూలై 31) ప్రకటించింది. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. హమాస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీన్ని ఇజ్రాయెల్‌ చేసిన దాడిగా అభివర్ణించింది.

టెహ్రాన్‌లోని ఆయన ఇంటి వద్ద జరిగిన దాడిలో ఇస్మాయిల్ హనియా, ఆయన బాడీగార్డ్‌ మృతి చెందారని పేర్కొంది. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరై ఇంటికి వచ్చిన తర్వాత దాడి జరిగినట్లు చెప్తున్నారు. హనియా హత్యపై దర్యాప్తు మొదలైంది.

బదులు చెల్లిస్తాం..: హమాస్‌
ఇస్మాయిల్ హనియా హత్యపై హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్జుక్‌ ఒక ప్రకటన విడుదల చేశాడు. ‘ఇది కుట్రపూరిత చర్య. దీనికి బదులు చెల్లించక తప్పదు’ అంటూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించాడు. ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడిలోనే హనియా మృతి చెందాడని ఆరోపించాడు. హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌ కూడా ఖండించారు. హనియా మృతి వార్తలను వైట్‌హౌస్‌ తెలుసుకుంది. వాటిపై స్పందించేందుకు శ్వేతసౌధం అధికార ప్రతినిధి నిరాకరించారు. ఇజ్రాయెల్‌ మాత్రం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

హనియా 1963లో గాజాకు సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980 చివరలో తొలి ఇంతిఫాదా సమయంలో ‘హమాస్‌’లో చేరాడు. 1990లో మొదటి సారి హనియా పేరు వినిపించింది. హమాస్‌ సంస్థ వ్యవస్థాపకుడు అహ్మద్‌ యాసిన్‌కు సన్నిహితుడు. యాసిన్ కు రాజకీయ పరమైన సలహాలు ఇస్తూ కుడి భుజంగా ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక ర్యాంకుల్లో పని చేశాడు. 2004 ఇజ్రాయెల్‌ దాడుల్లో అహ్మద్‌ యాసిన్‌ మరణించిన తర్వాత.. హమాస్‌లో కీలకంగా మారాడు.

2006లో పాలస్తీనా స్టేట్‌ పెసిడెంట్ గా ఎంపికై గాజా పట్టీని పాలించాడు. 2007 జూన్‌లో పాలస్తీనా నేషనల్‌ అథారిటీ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ అతడిని ఆ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో ఫతా-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అబ్బాస్‌ ఆదేశాలను పక్కనపెట్టిన ఆయన గాజా ప్రధానిగా కొనసాగాడు. 2017 లో హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అమెరికా ఇస్మాయిల్ హనియాను ప్రపంచ ఉగ్రవాదుల లిస్ట్ లో చేర్చింది. 2019లో గాజా పట్టిని వీడి ఖతర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్‌ ప్రకటించింది. కుటుంబం కోల్పోయినా ఇజ్రాయెల్‌పై పోరాటం ఆపొద్దని హనియా హమాస్ కు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. బందీల విడుదల నుంచి గాజాలో కాల్పుల విరమణ వరకు ఒప్పందాల్లో ఇతడు కీలకంగా వ్యవహరించాడు.

TAGS