Gobi Manchuria : గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం.. ఎక్కడంటే..
Gobi Manchuria Ban : ఒకప్పుడు సంప్రదాయ ఆహారపు అలవాట్లు మన దగ్గర ఉండేవి. గత దశాబ్దకాలంలో జంక్ ఫుడ్ కు జనాలు అలవాటు పడడం పెరిగింది. వివిధ రకాల రుచులు చూడాలనే కోరికతో రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. అలాంటిదే గోబీ మంచూరియా, పీచు మిఠాయి కూడా. తాజాగా వీటిపై కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఈ రెండింటిని అమ్మడంపై నిషేధం విధించింది.
కృత్తిమ రంగుల వాడకం ఆరోగ్యానికి హానికరమని తేలిందని కర్నాటక ఆరోగ్యశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో కృత్తిమ రంగులతో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించినట్టు చెప్పుకొచ్చింది. వీటిలో వినియోగించే రంగుల్లో రోడామైన్- బీ అనే రసాయనం ఆరోగ్యానికి హానికరమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు మాట్లాడుతూ.. అధికారులు రాష్ట్రంలోని వివిధ ఫుడ్ సెంటర్ల నుంచి 171 నమూనాలను సేకరించారని.. వాటిని పరీక్షించగా 107 పదార్థాల్లో హానికర కృత్తిమ రంగులను వినియోగించినట్టు తేలిందన్నారు. వాటిలో ఉండే రోడామైన్-బీ, టాట్రజైన్ వంటి రసాయనాలతో ఆరోగ్యానికి పెనుముప్పు పొంచి ఉందన్నారు. కాగా, ఈ మధ్యే తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా పీచు మిఠాయిపై నిషేధం విధించారు. దీంతో తెలుగు రాష్ట్రాలు కూడా వీటిపై నిషేధం విధించే అవకాశాలు కనపడుతున్నాయి.
కాగా, రోడామైన్- బీని దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటిని ఫుడ్ కలరింగ్ కు వాడకూడదు. దీనివల్ల కిడ్నీ, లివర్ , అల్సర్, క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని చెబుతున్నారు.