Diabetes : ఇప్పుడంతా బిజీ మనుషులు..ఎప్పుడు తింటున్నారో..ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియడం లేదు. మొబైల్ చూస్తూ ఏ అర్ధరాత్రో కొందరు నిద్రపోతే.. సాఫ్ట్ వేర్ వంటి డెస్క్ జాబ్ లతో రాత్రంతా మెలకువగా ఉంటున్నారు మరికొందరు. ఇంకొందరు నిద్రను అసలే పట్టించుకోరు. నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తూ ఏదో పని చేసుకుంటుంటారు. కానీ మంచి నిద్ర వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..నిద్ర సరిగ్గా పోకుంటే అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.
ఒక వ్యక్తి నిద్రించినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. రాత్రులు, నిద్ర సమయంలో ఇలా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం హెచ్చుతగ్గులకు లోను కావడం సహజమే. ఆరోగ్యవంతులైన వారు దీనికి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఇది ఆందోళనకరమే అని చెప్పుకోవాలి. నిద్రలేమితో వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసహజంగా మారుతాయి.
మనకు రోజుకు 7-8గంటల నిద్ర అవసరం. అప్పుడే మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా సాగుతాయి. తగినంత నిద్ర లేకపోవడం, సరైన వేళల్లో నిద్రించకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. నిద్రసరిగ్గా లేకపోవడం వల్ల గుండెజబ్బులకు కారణమవుతుంది. అలాగే రోజలో 6గంటలకు తక్కువగా నిద్రపోయే వారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు ఉంటుంది. ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఫలితంగా డయాబెటిస్ సమస్య ఏర్పడుతుంది.
కనుక 7-8గంటల పాటు మంచి నిద్ర, శారీరక వ్యాయామం అవసరం. ఐటీ కంపెనీల్లో నైట్ షిఫ్ట్ చేసేవారు, హాస్పిటల్స్, మీడియా, ఇతర కంపెనీల్లో రాత్రిళ్లూ పనిచేసేవారు 7 గంటల నిద్రను కచ్చితంగా పోవాలి. అప్పుడే డయాబెటిస్ ముప్పును తప్పించుకుంటారని వైద్యులు చెబుతున్నారు.