Liquor on the Train : రైల్లో లిక్కర్ తీసుకెళ్లవచ్చా..? ఏదైనా లిమిట్ ఉందా?..రూల్స్ ఏంటి?

Liquor on the Train

Liquor on the Train

Liquor on the Train : రైలు ప్రయాణాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదిస్తారు. దూరప్రయాణాలకైతే మరీనూ. హిల్ స్టేషన్లలో రైలు ప్రయాణం ఇంకెంతో మజాగా ఉంటుంది. నదులు, అడవులు, లోయలు, సొరంగాల గుండా రైలు దూసుకెళ్తుంటే ఆ ఆనందమే వేరు. ఇలాంటి అనుభవాల కోసమే రైలు ప్రయాణం చేసేవాళ్లు కూడా ఉంటారు. రైలు కిటికీల్లోనుంచి పచ్చటి పొలాలను చూస్తే ఆ అనుభూతిని మరిచిపోలేం.

ఇక దూరప్రాంతాలకు రైళ్లలో వెళ్లాలనుకునేవారికి ఓ డౌట్ వస్తూ ఉంటుంది. అద్భుతమైన రైలు ప్రయాణంలో మందు కూడా ఉంటే ఎంతో మజాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. రైలు కిటికీలోంచి ప్రకృతి అందాలను తిలకిస్తూ.. మందు తాగితే ఆ కిక్కే వేరప్పా అంటూ యూత్ అనుకుంటూ ఉంటారు. అలాగే కొందరు గోవా లాంటి ప్రదేశాల్లోకి వెళ్లి అక్కడ చవకగా దొరికే బీర్లు, విస్కీ బాటిళ్లను తేద్దామనుకుంటారు. అయితే వీరందరికీ అనేక అనుమానాలు వస్తుంటాయి.  రైళ్లో లిక్కర్ తాగొచ్చా?.. లిక్కర్ బాటిళ్లను తీసుకుపోవచ్చా? తీసుకెళ్తే ఎంత వరకు పర్మిషన్ ఉంటుంది..? అని తమకు తెలియక, తాము అడిగిన వారికి సరిగ్గా తెలియక అయోమయంలో ఉంటారు.. వారి సందేహాలకు సమాధానాలు ఈ కింద చదవండి మరి..

రైలు ప్రయాణానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఆ శాఖ రూపొందించింది. ప్రతీ ప్రయాణికుడు ఆ నిబంధనలు పాటించాల్సిందే. అలాగే రైల్వే సరుకుల రవాణాకు కూడా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల్లో నిషేధిత వస్తువులు కూడా ఉన్నాయి. వాటిలో మద్యం కూడా ఉంది. అంటే రైళ్లో లిక్కర్ తీసుకెళ్లేందుకు పర్మిషన్ లేదు. అంతేకాదు మద్యం తాగి లేదా ఇతర మత్తుతో కూడా రైలు ప్రయాణం చేయడాన్ని రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వదు.

ఒకవేళ మీరు ఇలా చేసినట్టు తేలితే.. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం మీపై యాక్షన్ తీసుకోవచ్చు. రైల్వే చట్టం ప్రకారం రైలులో మాత్రమే కాకుండా ఏదైనా రైల్వే ఆస్తిలో లేదా రైల్వే అధికారుల యాజమాన్యంలోని ఏదైనా ఆస్తిలో మద్యం లేదా మత్తు పదార్థాలను తీసుకెళ్లడం కుదరదు.

రైల్వే చట్టంలోని సెక్షన్ 145 ప్రకారం.. రైల్వే ప్రాంగణంలో లేదా రైల్వే క్యారేజీలో ఎవరైనా మత్తు పదార్థాన్ని సేవిస్తున్నారని లేదా మత్తులో ఉన్నారని, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని రైల్వే అధికారులు గుర్తిస్తే ఆ వ్యక్తి టికెట్ లేదా పాస్ రద్దు చేయవచ్చు. దోషిగా తేలిన వ్యక్తికి 6 నెలల వరకు జైలు, జరిమానాగా రూ.500వరకు విధించవచ్చు.

ఇక రైలులో ప్రయాణిస్తున్నప్పుడు నిషేధిత వస్తువులను తీసుకెళ్తే.. రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం అతడిపై చర్య తీసుకోవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం, ప్రయాణికుడికి రూ.1000 జరిమానా లేదా మూడేళ్ల జైలు లేదా రెండూ విధించవచ్చు. ఇది కాకుండా వ్యక్తి తీసుకొచ్చిన నిషేధిత వస్తువుల వల్ల ఏదైనా నష్టం జరిగితే..దానికి పరిహారం కూడా సదరు వ్యక్తే భరించాల్సి వస్తుంది.

TAGS