JAISW News Telugu

Zika Virus : జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్

Zika Virus

Zika Virus

Zika Virus : మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. వైరస్‌ విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి నివారణకు పుణె మున్సిపల్‌ అధికారులు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్‌ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్‌ చేస్తున్నారు.

మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదైంది. 46 ఏండ్ల డాక్టర్‌ తొలుత జికా వైరస్‌ బారిపడ్డారు. అనంతరం అతని కుమార్తె (15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దరితో పాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్ గా వచ్చాయి. ఈ నలుగురితోపాటు అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్  దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్ ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Exit mobile version