Sharmila:తెలంగాణ రాజకీయాల నుంచి షర్మిల ఔట్
YS Sharmila:పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణలో తనకు ప్రాధన్యత లభించే అవకాశం లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు బోధపడింది. అందుకే తన రాజకీయ మనుగడ కోసం ఆంధ్రాకు స్థావరం మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదని షర్మిల గ్రహించినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ వ్యవహారాలను చూసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్‌ను స్వీకరించడానికి ఎట్టకేలకు ఓకే చెప్పింది. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని మరోసారి హైకమాండ్ చేసిన తాజా ప్రతిపాదనకు ఆమె అంగీకరించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే ముందు షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తానని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ రెండు భారీ సభలను నిర్వహించే బాధ్యతను షర్మిలకు అప్పగించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ప్రియాంక గాంధీ భారీ ర్యాలీలో ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఇకపై కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన షర్మిలకు ఇక్కడ నిరాశే ఎదురైంది. పాలేరు బరిలో మంత్రి పొంగులేటి పోటీ చేయడం, గెలవడం ఆమెకు నష్టం చేకూర్చాయి. దీంతో తెలంగాణలో తన పార్టీకి మనుగడ లేదని భావించి ఇప్పుడు ఏపీలోనైనా చక్రం తిప్పాలని భావిస్తోంది.