YSRCP Leader:వైకాపా నేతల అరాచకాలు, ఆగడాలు అమెరికాను తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న సత్తారు వెంకటేష్ రెడ్డి..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల వయసున్న నిరుపేద యువకుడిని కొన్ని నెలల పాటు దౌర్జన్యంగా నిర్భంధించి చిత్రహింసలకు గురి చేశారు. పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు, విత్యుత్తు తీగలతో కొడుతూ నరకం చూపించారు. అంతే కాకుండా సదరు యువకుడి పక్కటెముకలు విరిగేలా క్రూరంగా ప్రవర్తించారు. ఆ యువకుడిని బానిసలా మార్చుకుని వెట్టి చాకిరీ చేయించుకున్నారు.
బాధితుడి దయనీయ స్థితి చూసిన ఓ స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిని రక్షించి ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వైకాపా నాయకుడు సత్తారు వెంకటేష్‌రెడ్డితో పాటు పెన్మత్స నిఖిల్, పెన్మత్స శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ చార్లెస్ కౌంటీ పరిధిలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. మానవ అక్రమ రవాణా, అపహరణ, ఆయుధాలతో దాడి వంటి అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు సత్తారు వెంకటేష్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగల పాలానికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు సత్తారు పుష్పారెడ్డి కుమారుడు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన సాధ్విక్‌రెడ్డి (మార్తాల పుల్లారెడ్డి) పేదరికాన్ని అలుసుగా తీసుకుని అమెరికాలో బాగా చదివించి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఏడాదిన్నర క్రితం తనతో అతన్ని స్టూడెంట్ వీసాపై అమెరికా తీసుకెళ్లారు. అక్కడ అతన్ని ఓ బేస్మెంట్‌లో బంధించి వెట్టి చాకిరీ చేయించుకున్నారు. చెప్పిన పని చేయకపోతే అతన్ని విపరీతంగా కొట్టేవారు.
రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే పడుకోవడానికి అవకాశం ఇచ్చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి వీరి హింస మరింతగా ఎక్కువైంది. స్థానికుడి ద్వారా బాధిత యువకుడి పరిస్థితి తెలుసుకున్న పోలీసులు సత్తారు వెంకటేశ్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లగా తను పోలీసులని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. పోలీసులు వచ్చారని గమనించిన బాధితుడు తనని రక్షించాలంటూ కేకలు వేస్తూ ఒక్కసారిగా బయటకు వచ్చాడు. వెంటనే పోలీసులు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం వెంకటేష్‌రెడ్డితో పాటు ఉంటున్న పెన్మెత్స నిఖిల్, పెన్మెత్స శ్రవణ్‌లపైన మానవ అక్రమ రావాణా, ధ్రువపత్రాల దుర్వినియోగం, హింస, ఆయుధాలతో దాడి, అపహరణ, వెట్టి చాకిరీ తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కీలక రాజకీయ నేతలతో పరిచయాలు..
సత్తారు వెంకటేష్‌రెడ్డికి ఇండియాలో కీలక రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్నట్టుగా తేలింది. అంగబలం, అర్థబలం చూసుకుని సత్తారు వెంకటేష్ రెడ్డి ఈ దురాగతానికి పాల్పడ్డాడని, బాధితుడిని ఇంటికి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేయించి పక్కనే ఉండి మాట్లాడించేవారని, అది కూడా సాధారణ కాలేనని, వీడియో కాల్, ఫేస్ టైమ్‌కు అనుమతించేవారు కాదని పోలీసులు వెల్లడించారు.