Minister Satyakumar : వైఎస్సార్ జిల్లాను వైస్సార్ కడపగా మార్చాలి: మంత్రి సత్యకుమార్
Minister Satyakumar : ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్సార్ కడపగా గెజిట్ లో మార్పు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. ‘‘రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప, ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంతవాసులకు దానవ పీడ తొలగించడానికి మత్స్యావతారంగా ఆవిర్భవించాడని ప్రసిద్ధి. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తనవలే తిరుమల క్షేత్రానికి వెళ్లలేని నిస్సహాయుల కోసం తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు.
నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి శ్రీవారిని దర్శిస్తుండడం ఆచారంగా మారింది. గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చింది. ఈ పరిణామంపై శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నాయి. భయంతో వారు అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. శాసనసభలో నేను ఈ విషయాన్ని కూడా ప్రస్తావించా. వైఎస్సార్ సీఎంగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవరూ కాదనలేరు. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ జిల్లాగా ఉన్న ఈ జిల్లాను వైఎస్సార్ కడపగా మార్చాలి’’ అని చంద్రబాబుకు రాసిన లేఖలో సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు.