YS Sharmila:దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ నుంచి అన్న వైఎస్ జగన్ కారణంగా తెలంగాణలో ప్రత్యక్షమైన షర్మిల ఇక్కడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని, తెలంగాణలో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేసింది. గులాబీ నేత కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ తెలంగాణలో రాజకీయం ప్రారంభించిన షర్మిల తన అనుభవ లేమితో తప్పటడుగులు వేసింది. ఫలితంగా తెలంగాణలో ఉనికిని కోల్పోయి మొత్తానికి ఫెయిల్ అయింది.
తెలంగాణ రాజకీయాల్లో జీరో అయిపోయిన షర్మిల మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి కారణంగా షర్మిల వార్తల్లో నిలవడం విశేషం. షర్మిల తనయుడు రాజారెడ్డి పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్టు తెలిసింది. రాజస్థాన్.. జోధ్‌పూర్‌లోని ఉమేద్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం విజయమ్మ, షర్మిల అమెరికాలోనే ఉన్నారు. జనవరి రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్ నిశ్చితార్థం జరగనుందని తెలిసింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ప్రియతో రాజారెడ్డి వివాహం ఖరారైంది. ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఆయన చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ తనయుడు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఆయనకు, తమ అధినేత, చట్నీస్ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇదిలా ఉంటే తాజాగా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి, తను అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రియ పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో దగ్గరి బంధువులని మాత్రమే నిశ్చితార్థానికి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది.