YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. ఈనేపథ్యంలో కొత్త మలుపులు తప్పడం లేదు. దీంతో కడపలో ప్రతి ఒక్కరు తమ ప్రభావం చూపించాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల, టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి లైన్ లో ఉన్నారు. దీంతో కడప రాజకీయం రసవత్తరంగా మారింది. అన్నాచెల్లెళ్ల సమరంపై రాష్ట్రమే కాదు దేశ స్థాయిలోనూ ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది.
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయంపై కన్నేసింది. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మరో కూటమిగా ఏర్పడింది. జగన్ మాత్రం ఒంటరిగానే బరిలో నిలిచారు. షర్మిల కడపలో ఎంపీగా అడుగు పెట్టాలని కొండంత ఆశతో ఉన్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. కడప ఎంపీగా షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
వివేకా హత్య కేసును ప్రధానంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సునీతతో కలిసి వివేకా హత్య కేసును నీరు గార్చి నిందితులకే కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నాన్న కోరిక మేరకే తాను ఎంపీ బరిలో నిలిచినట్లు చెబుతున్నారు. షర్మిల పోటీ చేయడంతో పోటీ ఎటు వైపు తిరుగుతుందో తెలియడం లేదు. కడప సీటుపై అందరిలో ఆసక్తి నెలకొంది.
జగన్ ఎన్నికలకు ముందు మంచిగానే ఉన్నా పదవి వచ్చాక మారిపోయారు. అమ్మను, నన్ను పట్టించుకోలేదు. అధికారం రాక ముందు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడంతోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పరాభవమే తమ ముందున్న లక్ష్యంగా పేర్కొంటున్నారు. ప్రజల ఆకాంక్ష కూడా అదే అంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడంతో పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, వైసీపీలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. విజయంపై వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని తాపత్రయ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రచారం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.