Congress:ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పీకే పనిచేసే అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణలో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ వ్యూహాలు రచిస్తోంది. అవసరమైతే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని టీఎస్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
BRSకు వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదనే ఆలోచనతో ఆమె పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌కు షర్మిల చూపిన అభిమానాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తు చేసుకుంది. ఈ క్రమంలో షర్మిలకు ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు కావడంతో షర్మిలకు ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. షర్మిలను ఏపీకి అధ్యక్షురాలిని చేస్తే పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు.