YS Sharmila : మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాక కొత్త ఉత్సాహం వచ్చింది. షర్మిల బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రతీ రోజూ మీడియాకు సెంటర్ పాయింట్ గా మారారు. అన్ని పార్టీలపై తనదైన మార్క్ తో గట్టి విమర్శలే చేస్తున్నారు. ముఖ్యంగా తన అన్న జగన్ రెడ్డిపై చేస్తున్న తీవ్రంగా విమర్శల దాడి చేస్తున్నారు. జగన్ పాలనా వైఫల్యాలతో పాటు వైఎస్ కుటుంబంలో విభేదాలు రావడానికి ఆయనే కారణమని కుండబద్దలు కొట్టినట్టు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
కాంగ్రెస్ చీఫ్ గా పార్టీని ఏపీలో మంచి స్థానంలో ఉంచడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో జోష్ తేవడంతో పాటు ప్రజల ప్రధాన సమస్యలపై ఆమె దృష్టి పెట్టారు. బీజేపీ, వైసీపీలు పూర్తిగా మర్చిపోయిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ విషయమై షర్మిల గళమెత్తాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మూడు ప్రధాన పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ప్రత్యేక హోదా సాధనను తన భుజాలపై వేసుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం(ఇవాళ) ఆమె మరో గంటలో దీక్ష చేయబోతున్నారు.
ప్రత్యేక హోదా విషయాన్ని అందరూ మరిచిపోయిన వేళ.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే పోరాటం చేస్తున్న షర్మిల..ఢిల్లీలో ఈ సమస్యను దేశం ముంగిటకు తీసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి షర్మిల దీక్ష దోహదపడుతుందనడంలో సందేహం లేదు. సో కాల్డ్ పార్టీలు చేయలేని పనిని షర్మిల చేస్తుండడంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవరూ చేయలేని పనిని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల తన భుజస్కంధాలపై వేసుకోవడంతో జనాలు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఏదో రకంగా ప్రత్యేక హోదా డిమాండ్ ను బతికించేందుకు షర్మిల పూనుకోవడం మంచి విషయమే.