YS Sharmila : పాపం షర్మిలకు రాజకీయాలు అచ్చిరావేమో అనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టి రెండు, మూడు సంవత్సరాలు కష్టపడి ఆ రాష్ట్రమంతా కలియదిరిగి కేసీఆర్ పాలనను ఎండగట్టింది. చాలా చోట్ల ఆమె యాత్ర ఉద్రిక్తతలకు కూడా దారితీసింది. కేసీఆర్ పై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆమె విరుచుకుపడిన తీరు చూసి..అమ్మో షర్మిల ఫైర్ బ్రాండే అనుకున్నారు. తెలంగాణలో షర్మిల ఎంత తిరిగినా ఫాయిదా ఉండదని అప్పటికే విశ్లేషకులు మొత్తుకున్నా ఆమె తన సమయాన్ని, కోట్ల రూపాయలను ఖర్చు పెట్టుకున్నారు. చివరకు కనీసం పోటీ చేయకుండానే తెలంగాణ నుంచి నిష్క్రమించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో ఆమె పార్టీని విలీనం చేశారు.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు సొంత అన్నపై ప్రతీకార బావుటా ఎగురువేశారు. అన్న జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఏపీలో ఎవరూ చేయని విమర్శలను షర్మిల తన అన్నపై చేశారు. జగన్ పాలనను రాష్ట్రమంతా తిరిగి మరి ఎండగట్టారు. షర్మిల దూకుడును చూసి కలుగులో ఉన్న పాత కాంగ్రెస్ నేతలంతా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిలకు సహకారం అందించారు. ఎన్నికల్లో షర్మిల సొంత జిల్లా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి జగన్ సవాల్ విసిరారు. చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డిని అన్న జగన్ వెనుకేసురావడంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. షర్మిలకు సమాధానం చెప్పలేక జగన్, అవినాశ్ రెడ్డి ఇద్దరూ తడబడ్డారు.
పోలింగ్ ముందు రోజు తల్లి విజయమ్మ సైతం అమెరికా నుంచి ఓ వీడియో చేసి మరి కడప ఓటర్లు షర్మిలను గెలిపించాలని కోరారు. కనుక కడప జిల్లా ఓటర్లు కడప ఎంపీగా షర్మిలను, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ గెలిపిస్తారని భావించారు. అయితే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీటును, ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదని తేల్చేశాయి. అయితే కనీసం షర్మిల అయిన గెలుస్తుందేమో అనుకున్న జనాలకు సర్వే సంస్థలు షాకిచ్చాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల కూడా గెలవకపోతే ఏపీలో ఆ పార్టీ దుకాణం మూసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మరో ఐదేండ్ల దాక ఏ ఎన్నికలు ఉండవు. అప్పటిదాక కాంగ్రెస్ కావడిని షర్మిల మోస్తుందా? అనే అనుమానం ఆమె వైఖరిని గమనించిన వారికి తెలుస్తుంది. ఫలితాల తర్వాత షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటును తీసుకుని రాష్ట్ర రాజకీయాల నుంచి బయటకు వెళ్తారా? లేదా అన్నతో కలుస్తారా? లేదా మొత్తానికే రాజకీయాలకు స్వస్తి పలుకుతారా? అనేది షర్మిల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.