YS Sharmila : వైసీపీ అధినేత, సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటన ఈ ఎన్నికల్లో పార్టీకి మంచి మైలేజీ ఇస్తుందని ఎవరు చెప్పారో కానీ బెడిసికొట్టిందనే చెప్పాలి. దాడిని వైసీపీ, వైసీపీ మీడియా ఒకసారి ఖండించి ఊరుకుంటే ప్రజల నుంచి సానుభూమి వచ్చేది.. ఇది మైలేజీ పెంచేది.. వినేందుకు కూడా బాగుండేది.
కానీ, వైసీపీ దాన్ని భూతద్దంలో చూపుతూ హత్యాయత్నంగా చిత్రీకరించడం, టీడీపీ నాయకుడు బోండా ఉమని ఇందులోకి లాగే ప్రయత్నం చేయడంతో ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న డ్రామాగా ప్రజలు భావిస్తున్నారు.
గత (2019) ఎన్నికల్లో చిన్నాన్న వివేకా హత్యపై వైసీపీ చాలా మాట్లాడింది. వారి సొంత మీడియా కూడా దాన్ని తమకు అవసరమైన కోణంలో మలుచుకొని కథనాలు ప్రచురించింది. ఈ సారి వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఆదేశించింది. అప్పుడు వైసీపీకి మంచి మైలేజ్ ఇచ్చిన వివేకా హత్య కేసు ఈ ఎన్నికల్లోగుడిబండగా మారుతుండటమే కారణం. ఒకే హత్య కేసు వల్ల వైసీపీకి ఒక ఎన్నికల్లో మేలు, మరో ఎన్నికల్లో కీడు జరుగుతుంది? అనే ప్రశ్నకు వైసీపీనే సమాధానం చెప్పాలి.
ఇక ‘గులక రాయి’ డ్రామా వైసీపీ కొనసాగిస్తుండడంతో, వైఎస్ షర్మిల కూడా స్పందించింది. కొన్ని రోజులకు ముందు వరకు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయని షర్మిల ఒక్కసారిగా పెదవి విప్పారు. ‘ఓ చిన్న గులక రాయి తగిలితే అది హత్యాయత్నం అంటూ చెప్పుకొంటున్నారు. ఆనాడు బాబాయ్ వివేకానంద రెడ్డిని 7 సార్లు గొడ్డలితో నరికి, నరికి చంపారు. చంపడమే కాదు గుండెపోటు అంటూ కథ అల్లారు. గొడ్డలి కంటే గులక రాయే ప్రమాదకరమైనదా..? గొడ్డలి వేటు కంటే గులక రాయి తీవ్రమైనదా?’
‘వివేకా హత్య గురించి తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సొంత చెల్లిని కాదని హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడిని చంకనెక్కించుకొని తిరుగుతుంటారు.. ఎందువల్ల? అని వైఎస్ షర్మిల ఘాటుగా ప్రశ్నించారు.