YS Jagan : వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన వాహనంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. మాజీ సీఎంగా ఉన్న ఆయనకు జడ్ ప్లస్ భద్రత కల్పించారు. అందులో భాగంగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరిన జగన్ మోహన్ రెడ్డి పది కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మంగళగిరి వద్ద ప్రైవేట్ టయోటా ప్రాడో వాహనంలో మారిపోయారు. కానీ వైసీపీ నేతలు మాత్రం కారు చెడిపోయిందని అందుకే జగన్ కారు మార్చారని ప్రచారం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా సోషల్ మీడియాలో ఇదే ఆరోపణలు చేశారు. జగన్ భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పాత వాహనాలు ఇచ్చారని ఆరోపించారు. వాహనాలు ఆగిపోవడంతో పర్యటన లేటయిందని విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియా, మీడియా ఇలాంటి ఆరోపణలు చేసింది. అధికారికంగా పోలీసు శాఖకు జగన్ భద్రతపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.
కానీ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పోలీసు శాఖ స్పందించింది. జగన్‌కు ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ స్పష్టం చేసింది. కారు ఫిట్‌నెస్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాల్లేవని.. జగన్‌కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే ఆయనకు కేటాయించామన్నారు. జగన్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోలేదని.. జగన్ కారు దిగిన తర్వాత అదే కాన్వాయ్‌లో ఆ వాహనం వెళ్లిందని, ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఆ వాహనంకు ట్రబుల్ ఇస్తే అక్కడే ఉండాలని కానీ అది జగన్ కాన్వాయ్ తో పాటే ఉందన్నారు.
వాస్తవానికి జగన్ పర్యటన కోసం కేటాయించిన సఫారీ (ఏపీ 39 పి0014) కండీషన్‌లోనే ఉంది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు అందులోనే ప్రయాణించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు.. అక్కడి నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ఇందులోనే ప్రయాణించారు. ‘చంద్రబాబు వాడిన కారు నేను ఎక్కడమేమిటి’ అనుకున్నారో ఏమో! ఎక్కిన ఐదు నిమిషాల్లోనే జగన్ కారు నుంచి దిగిపోయారు. దీనిపై ఆరా తీయగా జగన్ పర్యటనకు టయోటా ఫార్చూనర్ లేదా ల్యాండ్ క్రూజర్ ప్రడో పంపాలని తాడేపల్లి నుంచి ఐఎ్‌సడబ్ల్యూకు ఫోన్ వెళ్లింది. అయితే.. ఆ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బుల్లెట్ ప్రూఫ్ సఫారీని కేటాయించారు. అది కూడా విజయవాడలో సిద్ధంగా లేకపోవడంతో విజయనగరం నుంచి తెప్పించారు. గురువారం రాత్రి 11 గంటలకు అక్కడ బయలుదేరిన సఫారీ.. ఉదయానికి తాడేపల్లి చేరుకుంది. పూర్తి కండిషన్‌లో.. ఎక్కడా ఆగకుండా పరుగులు తీసింది. కానీ.. జగన్ ఎక్కిన ఐదు నిమిషాల్లోనే అది బ్రేక్‌డౌన్ అంటూ జగన్ పార్టీ తప్పుడు ప్రచారం చేసింది.