YS Jagan : ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. నెల్లూరు జైలుకు వెళ్లి ఆయనను కలిశారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ మాట్లాడుతూ పిన్నెల్లిని అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం మంచివాళ్లైన తమ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతోందని ఆరోపించారు. జైలు వద్దకు జగన్ రాకతో పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. జగన్ రాకతో పోలీసులు జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మే 13న జరిగిన ఎన్నికల్లో మాచర్లలోని పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును ‘నీ అంతు చూస్తా బయటకు రా’ అని బెదిరించారు. తర్వాత ఆయన అనుచరులు శేషగిరిరావుపై దాడి చేశారు. అక్కడే ప్రశ్నించబోయిన మరో మహిళను ‘ఏయ్ జాగ్రత్త’ అంటూ పిన్నెల్లి దుర్భాషలాడారు. పదుల సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద హల్ చల్ చేశారు. మరోవైపు డ్యూటీలో ఉన్న కారంపూడి సీఐపై దాడి చేశారు.
వీటన్నింటకి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. దీంతో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయనకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ జైలుకు వెళ్లి మరీ కలవడం చర్చనీయాంశమవుతోంది.