YS Jagan : మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. వైనాట్ 175నినాదంతో ఎన్నికల బరిలో దిగిన ఆయన కేవలం 11సీట్లకే పరిమితమై అసెంబ్లీలో ప్రతిపక్షానికి కూడా అర్హత లేకుండా పోయింది. ఇలాంటి ఓటమికి జగన్ కారణాలు వెతుక్కున్నప్పటికీ తన సొంత సామాజిక వర్గం అయిన రెడ్డి ప్రజానీకం కూడా తనను ఆదరించలేదా అన్న డౌట్ కలుగకమానదు. ఎన్నికల్లో అభిమానం ఉన్న జనాలతో కూడా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేయించ లేదా? ఇంతటి ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? అంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత గెలుపు ఓటములు తప్పవు. కానీ రెడ్డి సామాజిక వర్గం సుదీర్ఘకాలం కాంగ్రెస్ వెంట నడిచింది.
రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రత్యేక గుర్తింపు కూడా పొందింది. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యమిచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అదే సమయంలో వైసీపీ ఉన్నతికి కృషి చేసిన రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. చివరకు వారు ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పిటిసి, చివరకు సర్పంచ్ పదవుల్లో సైతం వేరే సామాజిక వర్గాల వారికి పట్టం కట్టింది. దీంతో అంతిమంగా రెడ్డి సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అయింది. తమ వరకు ఓకే కానీ.. కేడర్ తో కానీ.. ప్రజలతో కానీ ఓటు వేయించేందుకు ఆ సామాజిక వర్గం నేతలు ఇష్టపడలేదు. దాని ఫలితమే వైసీపీకి ఘోర పరాజయమని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో 90 శాతం కమ్మ సామాజిక వర్గం టీడీపీకి మద్దతు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మలు రంగంలోకి దిగి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. భారీగా నిధులను సమకూర్చారు. ఈసారి కానీ టిడిపి రాకుంటే కమ్మ సామాజిక వర్గం ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని భయాందోళన చెందారు. అందుకే తామే అభ్యర్థుల మన్న రీతిలో .. సామాజిక వర్గ పరంగా విభేదాలు ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కలుపుకుని వెళ్లారు. కానీ ఆ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గం ఎన్నికల్లో పని చేయలేదు. 2019లో అదే పని చేసిన రెడ్డి సామాజిక వర్గానికి ఐదేళ్లపాటు ఎటువంటి న్యాయం చేయలేదు జగన్.
తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి నాయకుడిగా 20ఏళ్ల శ్రమ ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాంటి నాయకుడికి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో తప్పించి.. వేరే వారికి అప్పగిస్తే కచ్చితంగా బాధ కలుగుతుంది. అదే బాధ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎదుర్కొన్నట్లు కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితికి జగన్ ఆలోచనలే కారణం అన్నట్టు తప్పు పట్టారు కేతిరెడ్డి.