JAISW News Telugu

YS Jagan Politics : కల్వకుంట్ల ఫ్యామిలీని మించిపోయిన వైఎస్ జగన్.. గెలుస్తారా..?

YS Jagan Politics

YS Jagan Politics, Ex CM KCR and AP CM Jagan

YS Jagan Politics : అవును.. అంతా మేమే చేశాం..! రాష్ట్రానికి మేం తప్ప ఇంకెవరూ దిక్కేలేరు..! మేం తప్ప ఎవరూ అభివృద్ధి చేయలేరు..! పొరపాటున మేం అధికారంలో లేకపోతే రాష్ట్రం అదోగతే..! ఒక్క మాటలో చెప్పాలంటే మేం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్లుగా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను ఏలింది. సీన్ కట్ చేస్తే.. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజానీకం ఇంటికి పంపి మూలన కూర్చొబెట్టింది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. మూడోసారి ఎందుకు రాలేకపోయింది..? అసలు సారు కారుకు ఎవరూ ఊహించనంతలా ఎందుకు పంచర్ పడింది..? లోటు పాట్లు ఏంటి..? ఏ విషయాల్లో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది..? కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు ఎందుకు గెలిపించారనే విషయాలు బహుశా ఇప్పటికైనా కల్వకుంట్ల ఫ్యామిలీకి అర్థమయ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

దెబ్బ పడితే పంచర్!

వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌ల ప్రవర్తన ఎలా ఉన్నది.. అనే విషయం రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగిన క్లియర్ కట్‌గా చెబుతారు. ఏ నాడూ ప్రజలకు దగ్గరగా, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించిన పాపాన పోలేదు. మరీ ముఖ్యంగా.. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకుని.. అండగా నిలిచిన సందర్భాలు అస్సలే లేవు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణాలు సైతం తెగించి పోరాడారో.. అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. ఇంకా తొలి, మలి ఉద్యమాకారులను పట్టించుకోవడం.. వారికి ఏదైనా సాయం చేయడం లాంటివి చేయనే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. వందల విషయాలు చెప్పుకోవచ్చు. మరోవైపు.. కనీసం తమ సమస్యలు ఇవీ మహాప్రభో అని చెప్పుకోవడానికి కూడా కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఇలా ఏ విషయంలో చూసినా అహంకారంగానే కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రవర్తిస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అరెరే కారు ఎక్కడ దెబ్బపడింది.. ఎందుకు పంక్చర్ పడిందనే విషయం తెలిసింది. ఇప్పుడు అహంకారం నుంచి బయటికి రాకపోవడం, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో.

జగన్ కథేంటో..!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. కూల్చివేతలతో మొదలై.. ఇప్పటికీ కూల్చుతూనే ఉన్నారు. ‘నేను చెప్పిందే జరగాలి..’ అన్నట్లుగా ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించినా ఆ మరుక్షణమే వాళ్ల పని ఖతం. అరెస్ట్ చేయడం, అడ్రస్ లేని ప్రదేశాలకు తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఇలా డాక్టర్ సుధాకర్ మొదలుకుని.. నిన్న మొన్నటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు వరకూ చాలానే ఉన్నాయి. చివరాఖరికి ఇంచార్జుల  మార్పు, సిట్టింగ్‌లే రాజీనామాలు చేస్తుండటంతో జగన్ అహంకారం ఏ రేంజ్‌లో ఉందన్నది రాష్ట్ర ప్రజలకు తెలిసొస్తోంది. సింపుల్‌గా  చెప్పాలంటే సరిగ్గా 2019 ఎన్నికల ముందు టీడీపీపై ప్రజలు ఎలాంటి అభిప్రాయంలో ఉండి.. ఓట్లేశారో.. ఇప్పుడు వైసీపీకి అదే పరిస్థితి ఎదురైందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.

ఏదీ జగన్..!

ఒకటా రెండా పాదయాత్రలో లెక్కలేనన్ని హామీలిచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ పట్టించుకోలేదు. దీనికి తోడు ‘నవరత్నాలు’ అని చెప్పి ఎంతసేపూ వాటినే పట్టుకుని లాగుతున్నారే తప్ప అభివృద్ధి, ఉద్యోగాలు, రాజధాని, పోలవరం.. పలు రంగాల ఉద్యోగులకు ఇచ్చిన హామీలను మాత్రం అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం రాష్ట్రానికి చెప్పుకోదగిన పరిశ్రమ వచ్చిందా అంటే అబ్బే అదీ లేదు. పేరుకే సచివాలయ వ్యవస్థ కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు ఏ రేంజ్‌లో అవినీతి, అక్రమ బాటలో సాగుతున్నారన్నది ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయ్. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేశాం.. ఇది చేశాం.. అంతా మేమే చేశాం.. 2024లో గెలిపించకపోతే ఏపీ పరిస్థితి అదోగతే.. తప్పకుండా గెలిపించాల్సిందే.. అంతేకాదు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందంటేనే మళ్లీ ఓటేయండి అంటూ జగన్ సెంటిమెంట్ పండిస్తున్నారు. ఎంతసేపూ పథకాలు పథకాలు అని చెప్పడం.. 2024లో వైసీపీ రాకపోతే వాలంటరీ వ్యవస్థ మొదలుకుని అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా ఏ ఒక్కటీ దక్కదని ఓ రేంజ్‌లో వైసీపీ నేతలు డబ్బా కొట్టేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదనే కదా.. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చారు.. ఇన్ని రోజులూ జగన్ ఏం చేశారన్నది పైనున్న దేవుడికే తెలియాలి మరి.

కష్టం జగన్..!

మరీ ముఖ్యంగా జగన్ కూడా కల్వకుంట్ల కుటుంబానికి మించి అహంకారంతో ఉన్నారన్నది పలు సంఘటనలు చెబుతున్నాయి. సామాన్యుడు మొదలుకుని మంత్రుల వరకూ ఏ ఒక్కరూ ముఖ్యమంత్రిని డైరెక్టుగా కలవడానికి లేకుండా పోయింది. కనీసం ఇదీ సమస్య మహాప్రభో అని మొరపెట్టుకోవడానికి లేకుండా పోయింది. పోనీ పొరపాటున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో ఆ వ్యక్తి అడ్రస్ ఉండదిక. సదరు వ్యక్తికి మళ్లీ సీఎంవో నుంచి పిలుపు వస్తే తప్ప జగన్‌ను కలవడానికి లేదు. ఈ పరిస్థితితో కార్యకర్తలు మొదలుకుని మంత్రుల వరకూ జగన్ ఏం చేసినా సరే.. జగన్ .. జగన్.. అంతా జగన్నామ స్మరణకే సరిపోతోంది. దీంతో ఎంతసేపూ జగన్‌ పేరు జనాల్లోకి వెళ్తోందే తప్ప నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీల పేర్లు వెళ్లకపోవడంతో రానున్న ఎన్నికల్లో తాము పోటీచేస్తే భవిష్యతేంటి..? అని ఆందోళన చెందుతున్నారు.

ఇదే జరిగితే..!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. బీఆర్ఎస్‌ను ప్రజలు ఎంత తిట్టుకున్నా.. మొత్తుకున్నా అదేనండి.. ‘గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే’ అని కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంతో ధీమాగా ఉండేది. సీన్ కట్ చేస్తే కారును పంచర్ చేసి మూలన కూర్చుబెట్టిన పరిస్థితి. ఇప్పుడు జగన్ కూడా అదే పంథాలో పథకాలు ఇస్తున్నాం.. ప్రజలందరూ మనవైపే ఉన్నారనే గట్టి నమ్మకంతో ఉన్నారు. రేపొద్దున ఏమైనా జరగొచ్చు. భ్రమలో ఉన్న జగన్ అక్షరాలా ఫెయిల్ అవ్వొచ్చు.. లేకుంటే ఆ అహంకారమే వైసీపీ అధినేతను అడ్రస్ లేకుండానూ చేయొచ్చు.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Exit mobile version