Jagan Vs Sharmila : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగు మీడియాలో అన్నా చెల్లెళ్ల పర్యటనలే హెడ్ లైన్స్ గా మారిపోయాయి. ప్రధాన మీడియా చానళ్లతో పాటు అన్నీ పార్టీల సోషల్ మీడియాలు ఈ వార్తలతోనే నిండిపోతున్నాయి. అనుకూల, వ్యతిరేక ట్వీట్లు, పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు. ఇవాళ జరిగిన కీలక పరిణామాల్లో ఒకటి ఏపీ సీఎం జగన్.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలువడం, మరొకటి జగన్ చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ప్రస్తుతం అందరి చర్చ.. ‘‘కేసీఆర్, జగన్ ఏం చర్చించారు.. కాంగ్రెస్ లో చేరిన షర్మిల అనే బాణం ఎవరినీ గురి పెడుతుంది..’’. ఈ అంశాలను ఒక్కొక్కరిగా విశ్లేషిస్తే..
కేసీఆర్- జగన్ భేటీ..
హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను అందరూ కలిసిన ఇంతవరకూ జగన్ మాత్రం కలువలేదు. ఆయన పరామర్శించకపోవడంతో ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు ఈరోజు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని కేసీఆర్ నివాసంలో ఆయన్ను జగన్ పరామర్శించారు. అయితే ఇందులో పరామర్శ కన్నా రాజకీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీతో పాటు, టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా చేరనుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్-జగన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంతకీ కేసీఆర్, జగన్ ఏం మాట్లాడుకున్నారు? అని విశ్లేషకులు ఎవరికీ తోచినట్టుగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. వారి విషయం పక్కకు పెడితే..ఏం మాట్లాడుకుని ఉండొచ్చు అనేది కాస్త అంచనా వేయవచ్చు. దాని ప్రకారం.. ఏపీ ఎన్నికల్లో గెలవడమనేది జగన్, చంద్రబాబు, పవన్ లకు అత్యంత కీలకం. జగన్ ఇప్పుడూ ఒంటరి పోరు చేస్తున్నారు. టీడీపీ-జనసేన కూటమి నుంచి వైసీపీ బలమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇందులో సందేహామే లేదు. జగన్ తాను 175 గెలుస్తానని చెప్పినా అది మేకపోతు గాంబీర్యమే తప్ప క్షేత్రస్థాయిలో అలా లేదు. సంక్షేమ పథకాలతో కొన్ని వర్గాలను ఆకట్టుకున్న నిరుద్యోగులు, ఉద్యోగులు, మధ్యతరగతి జనాలు, మేధావులు జగన్ ప్రభుత్వంపై మండిపడ్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని, ఉపాధి కల్పన లేదని వాపోతున్నారు. తమకు పని చూపించాలి కానీ మూడు రాజధానుల పేరిట గందరగోళం అవసరమా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా చాలా వర్గాల్లో వైసీపీపై కోపం ఉంది. ఇక బీజేపీ కూడా టీడీపీ-జనసేనతో జట్టు కడుతుందని అంటున్నారు. ఒకవేళ ఆ కూటమి గెలిస్తే తనను కేసుల పేరుతో మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తారనే భయం జగన్ లో కనపడుతుంది.
వీరితోనే ఇలా ఉంటే.. తన చెల్లిని కాంగ్రెస్ లో చేర్పించుకుని కుటుంబాన్ని విడదీసి కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నాడు. ఇక ఆమె జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలను, ఆరోపణలను ప్రత్యర్థి పార్టీలు ఆయుధంగా మలుచుకుంటాయనడంలో డౌటే అక్కర్లేదు. ఇంటిపోరుతో జగన్ కే తప్ప టీడీపీ-జనసేనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ వారికి పెద్దగా పోటేం కాదు. కాకపోతే అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంది. అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. షర్మిలతో ఎటూ చూసిన జగన్ కే ఎఫెక్ట్ పడే అవకాశాలే ఎక్కువ. జగన్ ఇప్పుడు ఒంటరిగా మిగిలారు. తనకు ఒక పెద్ద భరోసా కావాలి. తన వ్యూహాలు కరెక్టో, కరెక్ట్ కాదో చెప్పే అనుభవశాలి కావాలి. అందుకే జగన్ కేసీఆర్ దగ్గరకు వెళ్లాడు. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయినా.. రాజకీయంగా పెద్దగా పతనమైతే కాలేదు. వ్యూహాలకు ఆయన దగ్గర కొదువ లేదు. రెండు సార్లు గెలిచిన తర్వాత ఉండే సహజ వ్యతిరేకత, తన అహంకారం, నిరుద్యోగులు, ఉద్యోగులు.. కేసీఆర్ ఓడిపోవడానికి ఇవే కారణాలు. అందుకే జగన్ కేసీఆర్ దగ్గరకు వచ్చి ..ఆయన ఆరోగ్యంపై పరామర్శ చేసి రాజకీయ సలహాలు తీసుకుని ఉంటాడు. కేసీఆర్ అండతో ఎంతోకొంతైనా జగన్ కు నైతిక భరోసా కలిగి ఉంటుంది.
షర్మిల కాంగ్రెస్ లో చేరిక..
అన్నతో విభేదాలతో ఏపీ ఇక తనకు అక్కర్లేదని తెలంగాణకు వచ్చిన షర్మిల, మళ్లీ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తన వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. అండమాన్ లో తనకు పని చెప్పినా చేస్తానని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. దీని అంతరార్థం ఇది.. పార్టీ ఆచూకీ లేని అండమాన్ లోనూ పనిచేస్తానంటే.. హైకమాండ్ ఏ రాష్ట్రంలో, ఏ పని చెప్పినా చేస్తానని చెప్పడమే. అంటే ఏపీలో సైతం పనిచేస్తానని, ఏ బాధ్యత అప్పజెప్పిన చేస్తానని పరోక్షంగా అన్నట్టే. అంటే రేపటి ఎన్నికల్లో అన్నపై విమర్శలకు, అన్న పార్టీపై పోటీకి ఆమె వెనకాడరు అని అర్థమవుతోంది. వైసీపీ, టీడీపీ-జనసేన లాంటి పెద్ద పార్టీల హోరాహోరీలో పెద్దగా క్యాడర్ లేని కాంగ్రెస్ తో షర్మిల ఏ మిరాకిల్ చేస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఇప్పటి వరకు ఉన్న అంచనా అయితే వైసీపీ అసంతృప్తులకు, ఇతర పార్టీల్లో సీటు దొరకని వారు, బీ గ్రేడ్ నాయకులు మాత్రం వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎక్కడా డిపాజిట్లు దక్కని కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎక్కడో ఓ చోట గెలిచే అవకాశం ఉంటే ఉండొచ్చు అంతే.
ఈ రెండు పరిణామాలు అన్నా, చెల్లి మధ్య ఎవరికీ ప్లస్ అవుతుందో, ఎవరికీ మైనస్ అవుతుందో రాబోయే ఎన్నికలే చెప్పనున్నాయి. వీరిద్దరి పోరును టీడీపీ-జనసేన కూటమి నిశితంగా పరిశీలిస్తోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఏమాత్రం ఆశ్రద్ధ వహించకపోవచ్చు. ఎందుకంటే ప్రతీ చిన్న విషయాన్ని కూటమి నేతలు ఆచితూచి డీల్ చేసుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది.