CM Jagan : ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ కు మరో 7 రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీలు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, బహిరంగ సభలతో బిజీబిజీ అయిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క అంశం విపరీతంగా ప్రభావం చూపబోతున్నట్టు అర్థమవుతోంది. అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపైనే ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాడీవాడీ సంవాదాలు నడుస్తున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల నష్టాలను టీడీపీ, జనసేన అధినేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీనిపై ఎన్నడూ లేనంత చర్చ ఏపీ ప్రజల్లో నడుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకని మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్నారన్నారు. ప్రజల భూములను వైసీపీ భూబకాసురులు లాగేసుకుంటున్నారని వారిని చైతన్యపరుస్తున్నారు. నీ బీరువాలో ఉండాల్సిన నీ ఇంటి కాగితాలు జగన్ రెడ్డి తన బీరువాలో పెట్టుకుంటున్నాడని టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
మొత్తానికి జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై జనాల్లో అవగాహన వచ్చింది. జగన్ గద్దె దించడానికి ఈ ఒక్క యాక్ట్ సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ ఎన్నికల్లోనైనా ఒక అంశం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగుల అంశమై బీఆర్ఎస్ ను గద్దె దించింది. అలాగే ఏపీలో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ జగన్ రెడ్డిని గద్దె దించడం ఖాయంగా కనిపిస్తోంది.