Mana Nudi – Mana Nadi : మాతృభాషను కాపాడుకోకపోతే మన సంస్కృతికి దూరమవుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గతంలో చెప్పారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమన్నారు. మాతృ భాషను, నదులను పరిరక్షించుకునేందుకు ‘మన నుడి… మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పవన్. “నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో కావలసినన్ని రుజువులున్నాయి’’ అంటూ ఆ సందర్భంగా పవన్ తెలిపారు.
మన నుడినీ, మన నదినీ కాపాడుకోవాలన్నారు. అందుకే మేధావులతో ఈ అంశంపై చర్చించినట్లు పవన్ తెలిపారు. మాతృ భాషను పరిరక్షించుకోవాలి.. మన నదులను కాపాడుకోవాలన్నారు. ఆయన రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా “మన నుడి… మన నది” కార్యక్రమం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి భాషాభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పలువురు మేథావులు పాల్గొన్నారు.
నాగరికతకు అమ్మ ఒడి నుడి. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. అలాగే మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ సమావేశంలో ఖాదర్ ఖాన్ అనే తెలుగు భాషాభిమాని ముస్లిం మాట్లాడుతూ.. తెలుగులో చాలా మంచి మాటలు ఉన్నాయన్నారు. ఉదాహరణకు ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు.. మీ ఆగమనం మాకెంతో సంతోషం.. మీరు వెళ్లిపోతామంటే ‘ఆగ’మనం.. తెలుగు భాషలో ప్రతీ చోట అద్భుతం ఉంటుంది. ఒక సారి మిత్రుడు ఒకరు చాలా బోరుగా ఉందిరా.. ఏమైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అని.. తెలుగు భాషలో ఉన్న అందం, ఔన్నత్యం మరెక్కడా కనిపించదు. హిందీ వల్ల తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. క్లాసుకు వెళితే తనను ముస్లిం అనుకుని .. హిందీలో ‘అబ్ క్లాస్ కే జాకే శాంతికే సాత్ బైటో’ అన్నాడు. వెంటనే శాంతి దగ్గరకు వెళ్లి కూర్చున్నాను. దీంతో ఆమె పెద్ద కేక వేసిందని చెప్పారు. తన స్కూల్ అయిపోయేంత వరకు శాంతి కరువైందని చెప్పి హాస్యం పండించారు. ఒక ముస్లిం అయి ఉండి ఖాదర్ ఖాన్ తెలుగును అంతగా అభిమానించడాన్ని చూసి అందరూ ముగ్ధులవుతున్నారు.