Ladies PG Hostel : బెంగళూరులోని కోరమంగళలో ఓ లేడీస్ పీజీ హాస్టల్ ఉంటున్న ఓ యువతి (22) దారుణ హత్యకు గురైంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కృతి కుమారి అనే యువతిని బీహార్ కు చెందిన 22 ఏళ్ల యువకుడు అతి దారుణంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో హంతకుడు హాస్టల్ లోకి జొరబడ్డాడు. కృతి కుమారి 3వ అంతస్తులో రూంలో ఉంటుందని తెలుసుకుని ఆమె రూంలోకి ప్రవేశించాడు.
ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో కృతి కుమారి గొంతు కోశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. లేడీస్ హాస్టల్.. అది కూడా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఆ హాస్టల్ లో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు యువతులు అదే రాత్రి పీజీ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన బెంగళూరులో పీజీలో ఉంటున్న యువతులను ఉలిక్కిపడేలా చేసింది.