JAISW News Telugu

Guntur East : గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Guntur East

Guntur East

Guntur East : ఏపీలో ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ పై కన్నేసింది. ఇప్పటికీ వరుసగా రెండు సార్లు ఇక్కడ వైసీపీ విజయదుందుభి మోగించింది. మూడో సారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి టీడీపీ కూటమి ప్రయత్నాలు చేస్తోంది.

గుంటూరు ఈస్ట్ కు ఓ స్పెషాలిటీ ఉంది. రాష్ట్రంలో 1983 నుంచి పార్టీ ఏదైనా గానీ ముస్లిం అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తున్న ఏకైక నియోజకవర్గమిదే. గుంటూరు లోక్ సభ పరిధిలోకి వచ్చే జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇదే. గుంటూరు సిటీ, మండలంలోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. 2,29,830 మంది ఓటర్లు ఉంటారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు అధికంగా ఉంటారు. కాపులు, వైశ్యులు, ఎస్సీలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటారు. అభ్యర్థుల గెలపొటములలో ముస్లిం ఓటు బ్యాంకే కీలకం.

1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్థిగా నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహరావు విజయం సాధించారు. 1955లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ తెల్లాకుల జాలయ్య, 1962లో సీపీకి చెందిన కనపర్తి నాగయ్య గెలిచారు. 1967లో శనక్కాయల అంకమ్మ, 1972లో విజయ రామానుజం, 1978లో లింగంశెట్టి ఈశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు.

టీడీపీ ఆవిర్భావించిన తర్వాత 9 సార్లు ఎన్నికలు జరగ్గా.. నాలుగు సార్లు కాంగ్రెస్ పాగా వేసింది. టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు గెలిచాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన షేక్ మస్తాన్ వలి.. ప్రజారాజ్యం పార్టీకి చెందిన షేక్ షౌకత్ పై 9,012 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీది మూడో స్థానం. 2014 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి షేక్ ముస్తాఫా చేతిలో మద్దాలి గిరిధర్ రావు ఓడిపోయారు. 2019లో కూడా ముస్తాఫా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్ ను ఓడించారు.

ఈ ఎన్నికల్లో ముస్తాఫా పోటీ చేయట్లేదు. ఆయన కూతురు నూరి ఫాతిమాను రంగంలో దించింది వైసీపీ. టీడీపీ తరఫున మరోసారి మహ్మద్ నజీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ తరుఫున మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి రేసులో నిలిచారు. దీంతో ఇక్కడ ముక్కోణ పోటీ ఉండక తప్పడం లేదు. మరి ఈసారి కూడా ఎవరు గెలిచినా కూడా ముస్లిం అభ్యర్థే కావడం విశేషం.

Exit mobile version