Chandrababu : చంద్రబాబు రాజకీయాల్లో అనుభవశాలి. తన చతురతతో రాజకీయాల్నిదాదాపు పాతికేళ్లు శాసించిన నేత. వ్యూహాలు పన్నడంలో దిట్ట. వేదికల మీద ప్రసంగం మొదలు పెడితే గంటల తరబడి మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో బాబు మాట్లాడుతుంటే అందరు ఆసక్తిగా వింటారు. అదే ఆయనకకు అలంకారమని చెబుతుంటారు.
సెటైర్లు వేయడంలో కూడా అందెవేసిన చేయి. అధికారంలో ఉన్నా లేకున్నా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసరడం ఆయనకు ప్రత్యేక అలంకారం. ఈ నేపథ్యంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రా కదలి రా అంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అక్కడ వైసీపీ నేతల తీరును ఎండగడుతున్నారు.
ప్రత్యేకంగా మంత్రుల పనితీరుపై వారి శాఖల మనుగడ గురించి సెటైర్లు వేశారు. వైసీపీ పాలనలో పనులు ముందుకు సాగడం లేదని చెప్పారు. గనులు మింగేసే వాడు గనుల శాఖ మంత్రి, పర్యాటకం అంటే తెలియని మహిళ పర్యాటక మంత్రి అంటూ మంత్రుల శాఖలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. బాబుతో రాజకీయం మామూలుగా ఉండదు. కౌంటర్లు వేయడంలో బాబు స్టైలే వేరు.
రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరోమారు అధికారంలోకి రావాలని అనుకుంటున్న బాబు తన చాతుర్యంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో అధికారంలో నిలపడమే ధ్యేయంగా ఆలోచిస్తున్నారు. నేతలను కూడా అందుకు సిద్ధమయ్యేలా దిశా నిర్దేశం చేస్తున్నారు.