India Vs England : టీ 20 ప్రపంచకప్ లో టీం ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. అయితే అక్కడ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను ఢీకొనబోతుంది. 2022 పొట్టి ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ పై టీం ఇండియా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. బట్లర్ దంచి కొట్టడంలో 160 పరుగుల ఛేజింగ్ ను నాలుగు ఓవర్లు ఉండగానే ఊదిపడేశారు. దీంతో ఇండియా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం 2022 ఓటమికి ఇంగ్లండ్ పై గెలిచి రివేంజ్ తీసుకునే సమయం ఆసన్న మైంది. దీంతో ఎలాగైనా సరే ఇంగ్లండ్ ను ఓడించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ మ్యాచుల్లో టీం ఇండియా గ్రూపు, సూపర్ 8 మ్యాచుల్లో ఆధిపత్యం కనబర్చి సెమీస్ కు అలవోకగా చేరింది. ఇప్పటి వరకు టోర్నీలో ఒక్కసారి కూడా మ్యాచ్ లో ఓడిపోలేదు. దీంతో అత్యంత బలంగా టీం ఇండియా కనిపిస్తోంది. ఇంగ్లండ్ మాత్రం స్కాట్లాండ్ తో గ్రూపు మ్యాచ్ డ్రా చేసుకుని.. ఆస్ట్రేలియాతో ఓడిపోయి ముక్కి మూలిగి సూపర్ 8 కు చేరింది.
ఓమన్, నమీబియా లాంటి చిన్న దేశాలపై గెలిచి సూపర్ 8 కు చేరిన ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైంది. అనంతరం ఆడిన రెండు మ్యాచులు వెస్టిండీస్, అమెరికాపై గెలిచి సెమీస్ కు చేరుకుంది. దీంతో ఏ రకంగా చూసినా ఇంగ్లండ్ కంటే ఇండియాదే ఆధిపత్యం కనిపిస్తోంది. కానీ 2022 సెమీ ఫైనల్ ను గుర్తు చేసుకుంటే మాత్రం ఇంగ్లండ్ దే పై చేయిలా కనిపిస్తోంది.
ఇండియా బౌలర్లపై ఆధిపత్యం కనబర్చే బట్లర్, సాల్ట్, లివింగ్ స్టోన్ ,మెయిన్ అలీ ఇలా ఈ బ్యాటర్లను కచ్చితంగా కట్టడి చేయాల్సిందే. జస్ ప్రీత్ బుమ్రా భీకర ఫామ్ లో ఉన్నాడు. బుమ్రా తో పాటు అర్షదీప్, హర్దిక్ రాణిస్తే ఇంగ్లండ్ ను కట్టడి చేయొచ్చు. 2007 లో టీ 20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ మరో రెండు అడుగుల దూరంలో ఉంది. ఇంగ్లండ్ ను ఓడిస్తే ఫైనల్ చేరి కప్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.