Pawan Kalyan : ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువ. రూపాయి ఖర్చు పెట్టకుండా నేటి ఎన్నికల్లో గాంధీ, చంద్రబోస్ సైతం గెలవలేరు అని జనాల అభిప్రాయం. ఒకప్పుడు ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెద్దగా ఉండేది కాదు. 1990ల తర్వాత మనీ, మందు ప్రభావం చాలా పెరిగింది. డబ్బు ఉన్న వాళ్లే రాజకీయాల్లోకి రావడం, గెలవడం కోసం కోట్లు ఖర్చు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. జనాలు కూడా డబ్బు ఇచ్చిన వారికే ఓటు వేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితి చూసి బాధపడేవారు కూడా ఉన్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టకుండా గెలవడమనేది అసాధ్యంగా మారింది. ఈ విషయమే జనసేనానికి వివిధ అనుభవాలతో అర్థమైపోయింది.
ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా, అభ్యర్థులను చూసి, పార్టీ సిద్ధాంతాలతోనే గెలిపించాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019లో పోటీ చేసినా ఒక్క సీటు మాత్రమే గెలవగలిగారు. ఆయన సైతం రెండు చోట్ల ఓడిపోయారు. ఇక ఆయన దృష్టంతా 2024 ఎన్నికలపైన పెట్టారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలంటే, బలమైన వైసీపీని ఓడించాలని టీడీపీతో జట్టుకట్టారు. ఈ ఎన్నికల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలిపెట్టవద్దని ఫిక్స్ అయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి మాట్లాడారు.. ప్రస్తుత కాలంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కవుట్ అవ్వవని, తాను ఎప్పుడూ డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని.. నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టమని అన్నారు. ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్ధపు లోకంలోనే బతుకుతున్నామని, భవిష్యత్ లోనైనా ఇలాంటి రాజకీయాలు మారితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో డబ్బులు పంచకుండా పోటీలో ఉంటే జనసేన వచ్చిన ఫలితాలతో ఆయన రియాలైజ్ అయినట్టున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నీతి, నిజాయితీలకు చోటులేదని, జనాలు కూడా అడిగి మరి డబ్బులు తీసుకుంటున్నారనే విషయం ఆయన బోధపడినట్టుంది. అందుకే ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని ఆయన నిర్ణయించుకున్నారు.