JAISW News Telugu

Jagan – KCR : ఆయనను చూసైనా నేర్చుకోవాల్సింది.. అంతా అయ్యాక ఆరోపణలు చేస్తే ఏం లాభం?

KCR - Jagan

KCR – Jagan

Jagan – KCR : అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పాలన సాగిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుని మళ్లీ గెలిపించేవారు.  ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి జగన్‌ని ఉపేక్షించినందువల్ల 2019లో ఓడిపోయారు. కానీ  మళ్ళీ అదే ప్రజాస్వామ్య వ్యవస్థ 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించింది. ఏపీలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా జరుగుతుంది. పాలకులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాల్సిందే.  అలా కాకుండా  జగన్మోహన్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను, ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఐదేళ్లు నిరంకుశ పాలన చేశారు.  ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రతిపక్షాలను అణచేయాలని ప్రయత్నించారు.  

తెలంగాణలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నించి భంగపడటం కళ్లారా చూస్తున్నప్పడైనా జగన్ అలాంటి ఆలోచనలు మానుకోవాల్సింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సామెత మాదిరి అంతా అయిపోయిన తర్వాత  ఇక్కడ జగన్‌, అక్కడ కేసీఆర్‌ అదే ప్రజాస్వామ్యాన్ని ఆశ్రయిస్తుండటం విడ్డూరమే. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన ప్రజాస్వామ్యమే, ఓడిన తర్వాత తమని కాపాడుతుందని గట్టిగా నమ్ముతున్నారు.   ఇంతకీ ఇప్పుడు దీని ప్రస్తావన దేనికంటే, జగన్‌ ప్రజాస్వామ్యం, ఈవీఎంల గురించి చేసిన ట్వీటే. “న్యాయం అందుతుందని అనుకోవడం కాదు… అది అందిన్నట్లు కనిపడాలి కూడా. ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడమే కాదు… అది ప్రత్యక్షంగా కనిపించాలి కూడా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎన్నికల ప్రక్రియకు పేపర్ బ్యాలట్స్ మాత్రమే వాడుతున్నాయి. ఈవీఎంలు కాదు. కనుక మనం కూడా ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడుకునేందుకు మళ్లీ  పేపర్ బ్యాలట్స్ ప్రక్రియకు మారడం చాలా మంచిది,” అని జగన్ ట్వీట్‌ చేశారు.

అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే గెలిచాయని  జగన్‌ చెపుతున్నట్లు అర్థమవుతుంది. అంటే తమ ఓటమికి తన అసమర్ధత, అవినీతి, అరాచకాలు, అనాలోచిత నిర్ణయాలు కారణాలు కావని జగన్‌  నమ్ముతున్నట్లు స్పష్టం అవుతుంది. ఈసారి ఎన్నికలలో తమకు 175కి 175 సీట్లు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.  ఒకవేళ అన్ని రాకపోయినా ఈ ఎన్నికలలో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు జగన్‌ ఈవీఎంలను తప్పు పట్టేవారా? అంటే కాదని తెలుసు. అంటే తాము గెలిస్తే ఈవీఎంలు మంచివి లేకుంటే ప్రజాస్వామ్యానికి హానికరం అని జగన్‌ భావిస్తున్నట్లు అర్దమవుతోంది.  ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని, లోపాలు సరిదిద్దుకొన్నవారిని ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ నిరూపించి చూపారు. కానీ అహంకారంతో విర్రవీగితే ప్రజలు క్షమించరని గ్రహించడానికి కేసీఆర్‌, జగనే ప్రత్యక్ష సాక్షులు.

Exit mobile version