Kesineni Nani : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నేత ఇచ్చిన ‘వై నాట్ 175’కు ఎగ్జైట్ అయిన కేశినేని నాని టీడీపీని కాదని, చంద్రబాబును వదిలిపెట్టి జగన్ పంచన చేరారు. 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేసినేనికి గెలుపు బలుపు తలకెక్కింది. పార్టీ ఆదేశాలను తాను పాటించనని, తన ఆదేశాలనే పార్టీ పాటించాలి అనే స్థాయికి చేరుకున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి భారాన్ని అనుభవిస్తున్న తరుణంలో పార్టీకి, పార్టీ కేడర్ కు వెన్నుదన్నుగా ఉండాల్సిన కేశినేని పార్టీ ఓడినా నేను గెలిచాను అనే విజయ గర్వంతో ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఎంపీగా అవకాశం ఇచ్చిన పార్టీని పక్కన పెట్టి, ఓటర్ల అభిమతాన్ని పట్టించుకోకుండా, గెలుపునకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టి, సొంత తమ్ముడితో వివాదాలు పెట్టుకొని పార్టీ మారేందుకు కుంటి సాకులు వెతికారు.
అవకాశం చూసి దెబ్బకొట్టడంలో నాని ఆరితేరారని రుజువు చేసుకున్నాడు. చిరు స్థాపించిన పీఆర్పీలో చేరిన నాని ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీ అధినేత చిరంజీవిపై నిందలు మోపి బయటకు వచ్చి రాజకీయ ప్రయాణానికి లైన్ క్లియర్ చేసుకున్నాడు. అయితే అప్పుడు కాలం కలిసి రావడంతో రాజకీయంగా మెట్టు ఎక్కారు నాని.
ఇప్పుడు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని వైసీపీనే మళ్లీ గెలుస్తుందనుకొని భావించి టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యారు. అయితే అన్ని వేళలా కాలం తనకు అనుకూలంగా ఉంటుందనుకోవడం నాని అమాయకత్వమే అయ్యింది. 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన పార్టీని కాల తన్నిన, తన గెలుపునకు తెర వెనుక పని చేసిన తమ్ముడితో వైరం పెట్టుకొని అవినీతి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన నానికి విజయవాడ ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు.
కూలేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ నావ ఎక్కి చతికిలపడ్డాడు కేశినేని. ఆయన స్థానంలో టీడీపీ సీటు దక్కించుకొని నాని గెలుపు బలుపును బద్దలుకొట్టి టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా నెగ్గారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రావడంతో కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర పోషించింది టీడీపీ.
టీడీపీ ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి తొలిసారి ఎన్నికల్లో నిలిచి విజయం అందుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రి పదవులు దక్కడంతో అందరి దృష్టి కేశినేని వైపు పడింది. కేశినేని టీడీపీ తరుఫున బరిలోకి దిగి ఉంటే హ్యట్రిక్ విజయం అందుకునే వారు హ్యాట్రిక్ అందుకున్న ఆయనకే కేంద్ర మంత్రి పదవి దక్కేది. నాని ప్రస్తుత పరిస్థితి చూసి జాలిపడుతున్నారు ఆయన అనుచరులు.