Cummins : నాయకుడంటే నువ్వే బాసు.. కమిన్స్ పై ప్రశంసల జల్లు
Cummins : సన్ రైజర్స్ హైదరాబాద్ 2016 సీజన్ లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అప్పుడు ఆస్ట్రేలియా సూపర్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ జట్టును ముందుండి నడిపించాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడంతో పాటు ఎస్ ఆర్ హెచ్ కు కప్ అందించాడు. అక్కడి నుంచి నెక్ట్స్ సీజన్ టైటిల్ రేసులో ఫైనల్ వెళ్లినా చెన్నై తో ఓడిపోయారు.
2018 నుంచి ఒక్కసారి కూడా సన్ రైజర్స్ ఫైనల్ చేరలేదు. దీంతో ఈ టీంపై అంచనాలు పడిపోయాయి. ఐపీఎల్ లో మినీ యాక్షన్ జరిగిన సమయంలో కావ్య మారన్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. 17 సీజన్లలో ఎవరికి ఇవ్వనంతగా రూ.20.50 కోట్లతో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ను కొనుగోలు చేసింది.
దీంతో అక్కడున్న వారంతా కావ్యను చూసి నవ్వుకున్నారు. ఈమెకు పిచ్చి పట్టిందా అనే విధంగా ప్రవర్తించారు. సీన్ కట్ చేస్తే లాస్ట్ సీజన్ లో 10 వ స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ ప్రస్తుతం ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరగబోయే మ్యాచ్ లో కోల్ కతా పై గెలిస్తే సన్ రైజర్స్ మరో సారి కప్ కొట్టడం ఖాయం. దీనంతటికీ కారణం సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాడు.
ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఆటే మారిపోయింది. ఓపెనర్లు ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు చెలరేగి దంచికొడుతున్నారు. ఒకరి కంటే ఒకరు ఎక్కువగా రాణిస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. నితీశ్ రెడ్డి, షాబాద్ అహ్మద్, నటరాజన్ లాంటి ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ కమిన్స్ తన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నాడు. రెండు మూడు మ్యాచుల్లో జట్టు కష్టాల్లో ఉన్నపుడు కూడా 30కి పైగా పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దీంతో కమిన్స్ కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎక్కడో ఉన్న జట్టును ఫైనల్ చేర్చేశావు.. ఇక కప్ కూడా అందించవయ్యా అంటూ సన్ రైజర్స్ అభిమానులు కమిన్స్ ను కోరుకుంటున్నారు.