AP Government : నిన్న పింఛన్లు..ఈరోజు జీతాలు..ట్రాక్ లోకి ఏపీ

AP Govt

AP Government

AP Government : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఏపీలో దాదాపు నాలుగేళ్ల తర్వాత  నెల మొదటిరోజే ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల ప్రారంభంలో జీతాలు అందక ఉద్యోగులు నానావస్థలు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కారణంగా.. తొలి రోజే ఉద్యోగులకు జీతాలు వేయలేని పరిస్థితి ఏర్పడేది. దీనిపై ఉద్యోగ సంఘాలు అప్పట్లో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీలో ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు జమ అవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాచ్ నంబర్ల వారీగా జీతాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఏపీలో కొత్తగా కొలువు దీరిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పాలనలో మార్పులు తీసుకు వస్తుంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయగా.. ఈసారి సచివాలయ సిబ్బంది ద్వారా జులై పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. తొలి రోజే వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెంచిన పింఛన్లను సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందజేశారు. అటు ఎమ్మెల్యేల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ అందరూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటల వరకూ 81 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే ఉద్యోగులకు కూడా తొలి రోజే వేతనాలు చెల్లించి ఏపీ ప్రభుత్వం వారి అనుమానాలను పటాపంచలు చేసింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తొలి రోజు వేతనాలు ఇవ్వటం సాధ్యం కాదనే అనుమానాలు ఉండేవి. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు విడుదల చేసి..ఆ సందేహాలను పటాపంచలు చేసేసింది. దీంతో ప్రభుత్వం తీరుపై ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

TAGS