YCP Strategy : షర్మిలపై వైసీపీ వ్యూహమిదే.. అమ్మో పెద్ద ప్లానే..
YCP Strategy : కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల జనంలోకి వెళ్తున్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో నిస్తేజంగా ఉన్న పార్టీలో దూకుడు పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న తన అన్న జగన్ నే టార్గెట్ చేశారు. అన్నపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అయితే జగన్ చెల్లెలు కాబట్టి వైసీపీ నేతలు స్పందిస్తారో లేదో అని అంతా అనుకున్నారు. అయితే షర్మిల విమర్శలను వైసీపీ బాగానే తిప్పికొడుతోంది. ఆమె విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వెళ్తోందని తెలుస్తోంది. అందులో ఒకటి ఆమెను మీడియాలో హైలెట్ చేసి టీడీపీ, జనసేన విమర్శలను డైవర్ట్ చేయడం, రెండోది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలేలా చూసుకోవడం.
వ్యూహంలో భాగంగా.. షర్మిల ఆరోపణలను ఖండించేందుకు వయస్సులో పెద్దవారైనా, చాలా బ్యాలెన్స్ డ్ గా మాట్లాడే నేతలనే ఆమెపైకి ఉసిగొల్పుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మాన లాంటి వారితో షర్మిలకు కౌంటర్ ఇప్పిస్తున్నారు. షర్మిల విమర్శలకు స్పందిస్తూ ఆమెను మీడియాలో హైలెట్ చేయడం తద్వారా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ చేసే ఆరోపణలు, ప్రసంగాలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల కామెంట్స్ ను ప్రాధాన్యమిచ్చి ఏపీ రాజకీయాల్లో ఆమె క్రియాశీలంగా ఉన్నారనే భావనను ప్రజల్లో కల్పించడం.
ఇలా షర్మిల సెంట్రిక్ గా రాజకీయాలను నడిపి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలని వైసీపీ భావిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ కు ఓట్ల శాతం తక్కువే ఉన్నా షర్మిల రాకతో 2-3శాతమైన పెరిగే అవకాశం ఉంది. కూటమిని ఎదుర్కొని జగన్ గెలవాలంటే ప్రతీ ఓటు కీలకమే. అందుకే వ్యతిరేక ఓటు మొత్తం టీడీపీ, జనసేనకే కాకుండా షర్మిల వైపు కూడా షిష్ట్ కావాలి. అప్పుడే జగన్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
షర్మిల రాకను, ఆమె విమర్శలను కూడా తనకు అనుకూలంగా మల్చుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది. మరో వైపు బహిరంగ సభల్లోనూ, మీడియా వేదికలపైనా కుటుంబాన్ని చీల్చతున్నారని కూడా సింపతీ కొట్టేయాలని చూస్తున్నారు. తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నానని, తనను ఢీకొట్టడానికి పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి అంటూ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలకు ఇవన్నీ పట్టించుకునే సమయం ఉండదు. తమకు ఎవరు మంచి చేస్తారో, రాష్ట్ర ప్రగతిని ఎవరు ముందుకు తీసుకెళ్తారో వారికే ఓటు వేస్తారు.