YCP Status Politics : రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రత్యేక హోదా పాలక పక్షానికి ఒక శాపంగా మారగా.. ప్రతిపక్షానికి అస్త్రమైంది. కానీ ఇప్పటికీ ప్రజలకు మాత్రం ఇదొక బ్రహ్మ పదార్థమే. ఏపీటీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల మొదలుకొని వైసీపీ అధ్యక్షుడు జగన్ వరకు ప్రత్యేక హోదా అంశంతోనే ప్రజల కళ్లు కప్పాలని ఆశపడుతున్నారు.
2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్షం పాత్రలో జగన్ ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి దీన్నే చూపుతూ అధికారంలోకి వచ్చాడు. వచ్చిన ఐదేళ్లు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు. దీంతో 2024లో వైసీపీ 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్షంలో ఉండిపోయింది. ఇప్పుడు మళ్లీ ‘ప్రత్యేక హోదా’ నినాదం తెరపైకి తెచ్చారు జగన్.
జగన్ వాదనకు ఎన్డీయే కూటమి పార్టీ జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఊతమిచ్చారు. తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నితీశ్ కేంద్రానికి బిహార్ అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపారు. దీంతో జగన్ మళ్లీ తాను ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం చిక్కిందనే ఉద్దేశంతో హోదా రాజకీయం పెట్టేందుకు కావాల్సిన అన్ని అస్త్రాలను శోధిస్తున్నారు.
టీడీపీ బలంతోనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నితీష్ మాదిరిగానే ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లు చేయలేని పనిని అధికారంలోకి వచ్చిన కూటమి ఐదు వారాలకే పూర్తి చేయాలి అంటూ పోస్టులు పెట్టడం వైసీపీ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అనే చెప్పాలి.
2024 ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాం అంటూ గతంలో బీరాలు పోయిన వైసీపీ. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎవరి మెడలు వంచిందో చెప్పలేని పరిస్థితి.
హోదా తెస్తానని మాటిచ్చి అధికారం దక్కించుకున్న జగన్ ఐదేళ్లు తన కేసుల కోసం హోదాను తాకట్టుపెట్టి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లగానే మళ్లీ భూజానెత్తుకుంటే ప్రజలు వినరు సరికదా.. పట్టించుకోరు కూడా. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రాన్ని కాదని ముందడుగు వేసే పరిస్థితి లేదు.
వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా రాష్ట్ర విభజన కన్నా ఎక్కువగా నష్టాన్ని కళ్ల చూసింది.
ఇప్పుడున్న రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతగా మెలగాలి లేదంటే నష్ట పోయేది రాష్ట్ర భవిష్యత్తే. కేంద్రంతో సామరస్యంగా ఉంటూనే రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించుకోగలగాలి. జగన్ ఇప్పటికైనా అరిగిపోయిన రికార్డ్ మాదిరి పాత స్క్రిప్ట్ తో రాజకీయాలు చేస్తే మోసపోయేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు.