TDP-Janasena : వైసీపీ ఔట్ డేటెడ్ పాలిటిక్స్..ఆ విషయంలో వారికి ఫుల్ క్లారిటీ!
TDP-Janasena : ఎన్నికలు దగ్గరపడుతుండడంతో టీడీపీ, జనసేన అధిపతులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. ప్రత్యర్థికి చిక్కని వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంత ఈజీగా కాదని.. నానా గొడవలు జరుగుతాయని, ఆఫీసులు, ఫర్నీచర్లు ధ్వంసమవుతాయని, రచ్చ రచ్చ చేస్తారని, ఇది తమకు లాభిస్తుందని వైసీపీ నేతలు బోలేడు ఆశలు పెంచేసుకున్నారు. అలాంటి ఉద్దేశంతోనే జనసేన పార్టీలో ఊరుపేరూ లేని నాయకులకు ఎలివేషన్లు ఇచ్చేందుకూ తగ్గడం లేదు. అయితే వైసీపీ నేతలకు కాదు కదా ఆ పార్టీ అధినేతకు సైతం అర్థం కాని విషయం ఏంటంటే.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు పూర్తి క్లారిటీ ఉంది. దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో వారికి ఓ విజన్ ఉంది.
పవన్ కల్యాణ్ తన బలాన్ని ఈసారి అతిగా ఊహించుకోవడం లేదు. అది ఆయన మాటలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏం చేస్తే జగన్ రెడ్డి ఇంటి బాట పడుతారో అనేది కూడా తెలుసు. ఇదే విషయాన్ని పవన్ తన క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు కూడా. చాలా కాలం నుంచి ఆయన చెప్పాలనుకున్నది చెబుతున్నారు. పట్టుబట్టి సీట్లు తీసుకుని వైసీపీకి మేలు చేయడం కన్నా కచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారు.
ఆ ప్రకారమే కసరత్తు కూడా చేస్తున్నారు. ఎన్ని సీట్లు ఇవ్వాలి..ఏయే సీట్లు ఇవ్వాలన్న దానిపై ఆరు నెలల కిందటే ఓ అభిప్రాయానికి వచ్చారని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఎన్ని సీట్లు ఇస్తారు.. ఏయే సీట్లు ఇస్తారన్న దాన్ని వ్యూహాత్మకంగా ప్రజల్లోకి పార్టీ క్యాడర్ లోకి పంపాలనుకుంటున్నారు. ఆ కార్యచరణ ప్రారంభమైంది కూడా.
ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వైసీపీ.. జనసేనను రెచ్చగొడుతున్నామనుకుని ఆ పార్టీకి పబ్లిసిటీ ఇస్తోంది. చంద్రబాబు పది సీట్లు ఇస్తారని ఓ సారి.. కనీసం నలభై సీట్లు ఇస్తారని మరోసారి పొంతన లేకుండా నీలి, కూలి మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి అసలు సమాచారం చంద్రబాబు, పవన్ కు తప్ప ఎవరికీ తెలియదు. స్వయంగా కారు తోలుకుంటూ పవనే చంద్రబాబుతో భేటీకి వచ్చారంటేనే తెలుస్తోంది..ఇద్దరూ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో అని.
ఇక టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే, తమ పార్టీ స్థానం ఎక్కడ ఉంటుందో వైసీపీకి తెలుసు కాబట్టి.. రెచ్చగొట్టి రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. దమ్ముందా? సిద్ధమా? అనే డైలాగులు కూడా దంచుతున్నారు. అవన్నీ ఔట్ డేటెడ్ పాలిటిక్స్ అని.. అసలు సినిమా తాము చూపిస్తామని.. టీడీపీ, జనసేన..స్ట్రాటజిక్ స్క్రిన్ ప్లే నడిపిస్తున్నాయి.