Operation Pithapuram : ఏపీలో ఎన్నికలు మరింత రసవత్తరం కానున్నాయి. అన్ని పార్టీల్లో అభ్యర్థుల ప్రకటనలతో సీట్లు రానివారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో సీట్లు రాని వారు రచ్చకెక్కుతున్నారు. ఈ పరిణామాలను ప్రత్యర్థి పార్టీలు గమనిస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగారు. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యి తన వద్దకు రావాల్సిందిగా అక్కడి టీడీపీ సీటును ఆశిస్తున్న వర్మను ఆదేశించారు. ఇక్కడి పరిస్థితులను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
కాగా, పిఠాపురం వైసీపీ ఇప్పటికే వంగా గీతను తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇక్కడి నుంచి పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ స్థానంపై వైసీపీ మరింతగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎలాగైనా పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తోంది. దీని కోసం ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే గోదావరి జిల్లాల ఇన్ చార్జిగా ఉన్న మిథున్ రెడ్డి పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్ పోటీ చేస్తే ఎలాంటి సమీకరణాలు చోటుచేసుకుంటాయనే అంశంపై నియోజకవర్గ నేతలతో సమీక్ష చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ సేవలను ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై ఒక అంచనాకు వచ్చారు. స్థానికంగా సామాజిక సమీకరణాలు, గ్రామాలవారీగా నాయకులతో చర్చలు చేస్తున్నారు. తమతో కలిసి వచ్చే నేతలపై గురిపెట్టారు.
పిఠాపురంలోని మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గం దాదాపు 30శాతం వరకు ఉంది. మాలలు 12 శాతం, శెట్టి బలిజలు, చేనేతలు, బెస్తలు సుమారు 10శాతం, ఆ తర్వాత రెడ్డి, యాదవ, తూర్పు కాపులు, మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. పవన్ కు మద్దతుగా మెజార్టీ కాపు వర్గం నిలిచే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే వర్మ నిర్ణయం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. వర్మ ఈరోజు తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు కోరుతున్నారు. 2014లోనూ ఇదే కూటమి పోటీ చేసిన సమయంలోనూ వర్మకు సీటు దక్కలేదు. అయినా వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఈ సారి కూడా అదే రిపీట్ చేద్దామని ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు.
ఈ నేపథ్యంలో వర్మను తన వద్దకు రావాల్సిందిగా చంద్రబాబు సూచించారు. మద్దతుదారులతో సమావేశం తర్వాత టీడీపీ అధినేతను ఆయన కలిసే అవకాశం ఉంది. పవన్ పోటీ చేస్తుండడంతో సహకరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కానీ వర్మ ఈ ఎన్నికల్లో పవన్ కు మద్దతిస్తారా..స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అనేదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. గీత 2009లో ప్రజారాజ్యం నుంచి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే అక్కడ కాపుల్లో మద్దతు సంపాదించారు. వైసీపీ ఓటు బ్యాంకు ఉంది. గీత అభ్యర్థిగా కొనసాగనున్నారు. ముద్రగడ చేరిక తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. అయితే వర్మ నిర్ణయం ఆధారంగా వైసీపీ తన స్ట్రాటజీని అమలు చేసే అవకాశం ఉంది.