Chandrababu Strategy : ఎన్నికల మేనేజ్ మెంట్ ద్వారా మరోసారి అధికారం చేపట్టాలని తహతహలాడిన వైసీపీకి చంద్రబాబు ముందుచూపుతో చేసిన పని ద్వారా చుక్కలు చూపించారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని చంద్రబాబు ముందే ఊహించారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ‘ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించండి…. ప్లీజ్’ అని కోరితే జరిపించేయదని ఆయనకు బాగా తెలుసు. ఈసీ అనే ఏనుగుకి మోడీ అనే అంకుశంతోనే కదలిక వస్తుందని తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎంతగా అవహేళన చేస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకంజ వేయకుండా బీజేపీతో పొత్తు ఖరారు చేసుకున్నారు.
టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటో ఏం జరుగుతుందో వైసీపీ వాళ్లకు తెలుసు. అందుకే పొత్తు కుదరకుండా ఉండేందుకు దగ్గుబాటి పురందేశ్వరిని అనరాని మాటలు అన్నారు. పొత్తు కుదిరిన తర్వాత కూడా టికెట్స్ దక్కని ఏపీ బీజేపీ నేతలను చంద్రబాబు, పురందేశ్వరిలపైకి ఉసిగొల్పేందుకు ప్రయత్నించారు కానీ ఫలించలేదు. ‘‘టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచే ఈసీ ధోరణిలో మార్పు మొదలైందని’’ పేర్ని నాని, అంబటి రాంబాబు వంటివారు ఆరోపించారు. అంటే చంద్రబాబు నాయుడు ముందుచూపు, ఆలోచన ఫలించిందని వైసీపీ నేతలే అంగీకరించనట్టే.
ఎన్నికల్లో వైసీపీ పెట్రేగిపోకుండా నియంత్రిస్తూ ప్రజలు ధైర్యంగా తమ ఓట్లు వేసేందుకు తోడ్పడుతూ నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా చేయాలని మాత్రమే చంద్రబాబు నాయుడు ఆశించారు. అంతేతప్ప టీడీపీ కూటమిని ఏకపక్షంగా ఈసీయే గెలిపించేయాలని కోరుకోలేదు. ఈసీ ఎన్ని జాగ్రత్తలు తీసుకునప్పటికీ పోలింగ్ సమయంలో, తర్వాత కూడా వైసీపీ మూకలు చెలరేగిపోయాయి. అల్లర్లు చెలరేగాయి.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏకంగా పోలింగ్ బూత్‌లో ప్రవేశించి ఈవీఎంని ధ్వంసం చేసి, వైసీపి తడాఖా రుచి చూపించారు కూడా. ఒకవేళ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు విషయంలో వెనక్కి తగ్గి ఉంటే, నేడు ఎన్నికలు మరోలా జరిగేవి. అప్పుడు ఫలితాలు కూడా మరోలా ఉండేవి. అందుకే వైసీపీ మూకలు ఎన్నికల్లో అరాచకం సృష్టించి అక్రమదారుల్లో మరోసారి అధికారంలో రాకుండా చంద్రబాబు నిలువరించగలిగారు. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రజలు నిర్భయంగా తమ ఓటును వేశారనే చెప్పవచ్చు. దాని ఫలితంగా జూన్ 4న వచ్చే ఫలితాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే అవకాశాలే పుష్కలంగా కనపడుతున్నాయి.