YCP Politics : ఎన్నికల వేళ రాజకీయ నాయకులు రంగులు, జెండాలు మారుస్తారనేది మనకు తెలిసిందే. ఇటు సీటు రాని వారు అటు.. అటు సీటు రాని వారు ఇటు వస్తారు. మొత్తానికి గెలువగలిగిన పార్టీ వైపు ఉండాలని ప్రతీ రాజకీయ నాయకుడు కోరుకుంటారు. అందుకే రాజకీయ జన్మనిచ్చిన పార్టీలను సైతం వదులుకుంటారు. పదవులు కట్టబెట్టడంతో పాటు ప్రజల్లో గౌరవాన్ని తెచ్చి పెట్టిన పార్టీని వీడి ఎన్నికల అవసరం కోసం ఇతర పార్టీలకు జంప్ అవుతారు. ఇంకొందరు తమ పార్టీ ఓడే అవకాశాలు ఉన్నాయని తెలిసి.. ఆ పార్టీ నుంచి గెలుస్తామని చెప్పి అటువైపు దుముకుతారు. ఎన్నికల వేళ ఒక్కో రాజకీయ నాయకుడిది ఒక్కో కథ..అన్ని పార్టీల్లో జంప్ జిలానీలు ఉంటూనే ఉంటారు.
ఇక ఏపీలో ఎన్నికలకు మరో రెండు, మూడు నెలలే ఉండడంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ తన అభ్యర్థుల జాబితాను వడివడిగా వదిలేస్తున్నారు. తన అభ్యర్థుల్లో చాలా మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల ద్వారా తెలుసుకుని వారిని మారిస్తే మరోసారి గెలవవచ్చనే ఉద్దేశంతో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే.. జనాల్లో వ్యతిరేకత ఒక్క ఎమ్మెల్యేలపైనే కాదు..ప్రభుత్వంపై కూడా..అని ఆయన గుర్తించడం లేదని విపక్ష నేతలు విమర్శిస్తుంటారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎంనే అని టీడీపీ, జనసేన అధినేతలు చెబుతుంటారు.
ఇక జగన్ చేసే పనుల వల్ల ఆ పార్టీలోని చాలా మంది నేతలు టీడీపీ, జనసేనల్లోకి జంప్ కావాలని చూస్తున్నారు. ఆయనపై వ్యతిరేకతను తమపై నెట్టివేసి..తమకు సీటు ఇవ్వకుండా చేస్తున్నారని సదరు సిట్టింగులు అంతర్మథనం చెందుతున్నారు. ఇష్టారాజ్యంగా మార్పులు, చేర్పులు చేస్తుండడంతో చాలా మందే కూటమి నేతల టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా బాలశౌరి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంకా పలువురు నేతలు క్యూ లో ఉన్నట్టు సమాచారం.
ఇక వీరిని తిట్టడానికి వైసీపీ బ్యాచ్ రెడీగా ఉంటుందనే చెప్పవచ్చు. ఇక్కడ గెలవలేని వాళ్లు కూటమిలో గెలుస్తారా? అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ యాగి చేయవచ్చు. వైసీపీలో ఉంటే పుణ్యాత్ములు.. టీడీపీ, జనసేనలో చేరితే పాపాత్ములు అన్నట్టుగా మీడియా ముందు రంకెలు వేయవచ్చు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే వాళ్లు మాత్రం వేలు పెట్టిన కొరకని మంచివాళ్లు అని స్పీచులు దంచుతారు. ఇదిలా ఉండగా.. కూటమి బలపడి తమకు మరోసారి అధికారం దక్కుతుందో లేదో అన్న ఆందోళన అధికార పార్టీలో మొదలైందనే చెప్పాలి.
టీడీపీ, జనసేన కూటమి మాత్రం..ప్రతీ నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. అక్కడి సామాజిక సమీకరణాలు, ప్రజల్లో అభ్యర్థుల ఆదరణ..ఇలా పలు కోణాల్లో అంచనా వేసి గెలుపు గుర్రాలను మాత్రమే ఆచితూచి ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కూటమి పార్టీల్లోకి చేరిన వారిలోనూ సమర్థులకు మాత్రమే టికెట్ ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నారు.