Nara Lokesh : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల వ్యూహాలు మరింత పదునెక్కుతున్నాయి. వైసీపీ ఇన్ చార్జుల మార్పు ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా వచ్చే నెల తొలి వారంలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. అటు కాంగ్రెస్ షర్మిల ద్వారా ఏపీలో పట్టుబిగించాలని ప్రయత్నిస్తోంది. ఈసమయంలోనే టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాలపై వైసీపీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.
టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబు, బాలయ్య, లోకేశ్ నియోజకవర్గాలపై వైసీపీ గురిపెట్టింది. కుప్పంలో 2019 ఎన్నికల నాటి నుంచే గురిపెట్టింది. 2024 ఎన్నికలను వారు కీలకంగా తీసుకున్నారు. అక్కడ భరత్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ‘వైనాట్ కుప్పం’ పేరుతో వైసీపీ బరిలోకి దిగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు అలర్ట్ అయి.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి పర్యటిస్తున్నారు. ఇదే విధంగా హిందూపురంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇక్కడి ఎన్నికల బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
ఇక టీడీపీ నేత లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిని వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 2019లో ఇక్కడి నుంచి ఓడిపోయిన లోకేశ్.. 2024ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే కు మొండిచెయ్యి చూపి గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్కే కాంగ్రెస్ లో చేరారు. ఇక ఇక్కడి వైసీపీ బాధ్యతలను సాయిరెడ్డి చూస్తున్నారు. లోకేశ్ ను మరోసారి ఓడించాలనే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు.
అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీపై పూర్తి వ్యతిరేకత ఉందని తెలిసే సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. గెలవడం కష్టం అనే సర్వే ఫలితాలతోనే కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది. అయితే ఇక్కడ లోకేశ్ కు గతంలో ఓడిన సానుభూతితో పాటు వైసీపీ వైఫల్యాలు, జగన్ పై వ్యతిరేకత, అమరావతి రాజధాని విషయం..ఇలా పలు కారణాలతో ప్రజలు లోకేశ్ వైపు మొగ్గుచూపుతున్నారనే ఆలోచనతోనే వైసీపీ కలవరపడుతోంది. అందుకే ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినా.. నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.