YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు

YCP MP Mithun Reddy
YCP MP Mithun Reddy : రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఏపీలో ఎన్నికలు పూర్తి అయినప్పటికీ పుంగనూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్ నడుస్తోంది. ఇదే సమయంలో వైసీపీకి చెందిన పలువురు నేతలను టీడీపీలోకి చేర్చుకుంటూ పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చేలా పావులు కదుపుతున్నారు. ఇటీవలే పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాషతో సహా మిగతా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో క్షేత్రస్థాయిలోని పరిస్థితిని చక్కదిద్దాలని భావించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు కార్యకర్తలతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఇంటిని చుట్టుముట్టారు. ఈ పర్యటనకు వెళ్తే పుంగనూరులో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు అయిన నేపథ్యంలో వందలాది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.